మొండికేసిన సురేఖ.. వేటు వేసిన రేవంత్!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న హైడ్రామాకు ఊహించిన ముగింపే లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలు, సొంత పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు వేటు వేసింది. తనంతట తానుగా గౌరవప్రదంగా తప్పుకోవడానికి సురేఖ ససేమిరా అనడంతో, ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఏఐసీసీ అధిష్ఠానం పచ్చజెండా ఊపిన వెంటనే, ఆమెను పదవి నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు అధికారికంగా లేఖ పంపారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
కొండా సురేఖ వ్యవహారశైలి గత కొంతకాలంగా పార్టీ నాయకత్వానికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే కాకుండా, విపక్షాలకు బలమైన ఆయుధంగా మారాయి. మొదట పార్టీ నేతలు ఆమెకు హితవు పలికి, స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని సూచించినట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ, కొండా సురేఖ మాత్రం వెనక్కి తగ్గలేదు. “నేను ఎలాంటి తప్పు చేయలేదు.. అలాంటప్పుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదు” అంటూ ఆమె తెగేసి చెప్పారు. ఆమె మొండివైఖరితో పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతోందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్ అనుమతితో నేరుగా బర్తరఫ్ అస్త్రాన్నే ప్రయోగించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించడం సీఎం రేవంత్‌కు సవాలుగానే మారింది. ముఖ్యంగా సీనియర్లు, వలస నేతల మధ్య పవర్ పాలిటిక్స్ నడుస్తున్న తరుణంలో కొండా సురేఖపై తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికగా మారింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా ఎంతటి సీనియర్ అయినా సహించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. అసంతృప్త స్వరాలు, స్వయంకృత తప్పిదాలను భరించే దశ దాటిపోయిందనే స్పష్టమైన సందేశాన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే బృందం రాష్ట్ర నాయకత్వానికి అందించింది.
ఇవి కూడా చదవండి
వరంగల్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, బలమైన కేడర్ కలిగిన కొండా దంపతులు ఈ చర్యను ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించే కొండా సురేఖ.. కేవలం మంత్రి పదవి బర్తరఫ్‌తో ఆగిపోతారా? లేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర సురేఖది. ఆ తర్వాత కాలంలో వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్, మళ్లీ కాంగ్రెస్ అంటూ పలు పార్టీలు మారిన నేపథ్యం ఉంది. ఇప్పుడు సొంత పార్టీ నుంచే ఉద్వాసనకు గురైన నేపథ్యంలో, ఆమె బీఆర్ఎస్ వైపు చూస్తారా లేక బీజేపీ గూటికి చేరతారా అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఆమె ప్రెస్ మీట్ పెట్టి నాయకత్వంపై ఎలాంటి బాంబులు పేల్చబోతున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
కొండా సురేఖ బర్తరఫ్‌తో మంత్రివర్గంలో ఒక బెర్త్ ఖాళీ అయింది. దీంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రధాన చర్చగా మారింది. సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు, బీసీ (పద్మశాలి) సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే మంత్రి పదవులపై కన్నేశారు. అటు సామాజిక న్యాయాన్ని కాపాడుతూనే, ఇటు పార్టీలో అసంతృప్తులు తలెత్తకుండా సమతూకం పాటించాల్సిన బాధ్యత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై పడింది.
మొత్తానికి, కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త రాజకీయ ప్రకంపనలకు నాంది పలికింది. రాజీ పడేది లేదన్న సురేఖ దూకుడు.. క్రమశిక్షణే పరమావధి అన్న అధిష్ఠానం తీరు రానున్న రోజుల్లో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.








