రేవంత్ సవాల్‌ను కేసీఆర్ స్వీకరిస్తే.. కాంగ్రెస్‌కు చుక్కలేనా!?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సరికొత్త రాజకీయ పాచిక తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శల దాడి పెంచిన రేవంత్, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్ నుంచి మళ్లీ తేల్చుకోవాలంటూ నేరుగా సవాల్ విసిరారు. గులాబీ బాస్‌ను నైతికంగా ఆత్మరక్షణలోకి నెట్టి, కేడర్‌లో నైరాశ్యాన్ని మరింత పెంచాలనేది అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం దీన్ని కాంగ్రెస్ వేస్తున్న అతి పెద్ద జూదంగానే భావిస్తున్నారు. కేసీఆర్ ఒకవేళ ఊహించని విధంగా ఈ సవాల్‌ను స్వీకరిస్తే, అది రేవంత్ రెడ్డి సర్కారుకు ముళ్లబాటగా మారే ప్రమాదముంది.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం, అధికార యంత్రాంగం చేతిలో ఉండటం రేవంత్ రెడ్డిలో దూకుడును, విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయనడంలో సందేహం లేదు. ‘కేసీఆర్ ఎలాగూ రాజీనామా చేసే సాహసం చేయరు’ అన్న గుడ్డి ధీమాతోనే కాంగ్రెస్ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయాల్లో అతి విశ్వాసం ఎప్పుడూ ప్రమాదకరమే. ఒకవేళ కేసీఆర్ గజ్వేల్‌కు రాజీనామా చేసి ఉపఎన్నికను ఆహ్వానిస్తే, ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటివరకు రేవంత్ పాలనపై అది నేరుగా ప్రజా రెఫరెండంగా మారుతుంది.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా నిధుల విడుదల, రైతు రుణమాఫీ ప్రక్రియలోని సాంకేతిక చిక్కులు, పింఛన్ల పెంపు వంటి అంశాలపై ప్రజల్లో అసహనం మొదలవుతోంది. పాలనాపరమైన ఈ ఒత్తిళ్లను బేరీజు వేసుకోకుండా కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే లక్ష్యంగా రాజీనామా డిమాండ్ చేయడం రేవంత్ వ్యూహాత్మక తప్పిదమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ రాజీనామాలను ఒక రాజకీయ బ్రహ్మాస్త్రంగా మలచుకున్న నాయకుడు. 2004 నుంచి 2014 వరకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కేసీఆర్, ఆయన సహచరులు పదేపదే రాజీనామాలు చేసి, ఉద్యమ సెంటిమెంట్‌తో ఉపఎన్నికల్లో అఖండ విజయాలు సాధించిన రికార్డు ఉంది. ప్రజా వ్యతిరేకత కాస్త మొదలవుతున్న సమయంలో కేసీఆర్ గనుక బరిలోకి దిగితే, “తెలంగాణ తెచ్చిన నన్ను అధికార కాంగ్రెస్ అణగదొక్కాలని చూస్తోంది” అన్న సెంటిమెంట్‌ను రగిలించే అవకాశం ఉంది.
గజ్వేల్ కేసీఆర్‌కు కంచుకోట. హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆ నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టుంది. పైగా గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడే స్థానంలో నిలిచింది. ఈ ఉపఎన్నిక అనివార్యమైతే, అది కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారుతుంది. అధికార పక్షంగా సర్వశక్తులూ ఒడ్డి కేసీఆర్‌ను ఓడించేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నించినా, ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం నేరుగా రేవంత్ రెడ్డి సీఎం కుర్చీపై, కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై పడుతుంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గణనీయంగా పుంజుకుని, తామే ప్రధాన ప్రతిపక్షమనే భావనను కలిగించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ సైతం బీజేపీనే ప్రధాన శత్రువుగా చిత్రీకరిస్తూ బీఆర్ఎస్ను కాలగర్భంలో కలిపేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. కానీ గజ్వేల్ ఉపఎన్నిక జరిగితే, దృశ్యం ఒక్కసారిగా మారిపోతుంది. బీజేపీని పూర్తిగా పక్కకు నెట్టేసి, రాజకీయం అంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారుతుంది. ఉపఎన్నికలో కేసీఆర్ విజయం సాధిస్తే, అది నిస్తేజంలో ఉన్న గులాబీ కేడర్‌కు బూస్టర్ డోస్ ఇవ్వడమే కాకుండా, రాష్ట్రంలో తమ ప్రాబల్యాన్ని పునరుద్ధరించుకోవడానికి సువర్ణావకాశాన్ని ఇస్తుంది. అదే జరిగితే, రేవంత్ రెడ్డి స్వయంగా కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
అయితే, ఉపఎన్నికలో ఒకవేళ ఓడిపోతే బీఆర్ఎస్ ఉనికికే ముప్పు వస్తుందన్న భయం కేసీఆర్‌కు కూడా ఉంది. కానీ కేసీఆర్ రాజకీయ చదరంగంలో ఎలాంటి నిర్ణయమైనా ఆకస్మికంగా తీసుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి విసిరిన ఈ సవాల్ కేసీఆర్‌ను దెబ్బతీయడం కంటే, కాంగ్రెస్ పార్టీని ఒక క్లిష్టమైన రాజకీయ సుడిగుండంలోకి నెట్టే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. రేవంత్ విసిరిన ఈ పాచిక కేసీఆర్ స్వీకరిస్తే, తెలంగాణ రాజకీయం భీకర సమరానికి వేదిక కావడం ఖాయం.








