నేడే కొండా సురేఖపై వేటు?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి, అధిష్టానం హెచ్చరికలను లెక్కచేయని ధోరణి పార్టీలో తీవ్ర కలకలం రేపడంతో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం పూర్తిస్థాయిలో మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన కేబినెట్లో చోటు దక్కించుకున్న సురేఖ, గత కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. దాదాపు రెండు వారాల కిందట రాజుకున్న వివాదం పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, తాజా పరిణామాలతో అధిష్ఠానం క్రమశిక్షణ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. ఇవాళే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మంగళ, బుధవారాల్లో హస్తిన వేదికగా సాగిన సమాలోచనలు రాష్ట్ర కాంగ్రెస్‌లో సమీకరణాలను సమూలంగా మార్చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో విడివిడిగా సమావేశమయ్యారు. మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం గట్టిగా పట్టుబట్టడంతో పాటు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా వేటు వైపే సిఫార్సు చేశాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఖర్గేతో సమావేశమై రాష్ట్ర పరిణామాలపై చర్చించగా, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖర్గేతో అరగంటపాటు భేటీ అయ్యారు. మరోవైపు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పించేందుకు అధిష్ఠానం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. తుది నివేదికలను మరోసారి పరిశీలించి ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మంత్రివర్గం నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైన తరుణంలో కొండా సురేఖ వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో మరింత దుమారం రేపింది. ఢిల్లీలో ఖర్గే, మీనాక్షి నటరాజన్‌లతో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆమె, నేరుగా ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. క్రమశిక్షణ ఉల్లంఘన పేరిట తనకు కాకుండా, ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలు చేస్తూ పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పార్టీ లైన్ దాటుతున్న సీఎం రేవంత్‌రెడ్డికే ముందుగా షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించారు. తన బిడ్డ చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేస్తూనే.. తనపై చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో పార్టీకి తీరని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
మహబూబాబాద్‌లో తన పేరు తొలగించడం వెనుక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలన్నింటినీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఇప్పటికే లేఖల ద్వారా చేరవేశానని పేర్కొన్నారు. గతంలో మహేశ్‌కుమార్‌గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నారని జగ్గారెడ్డి ఆరోపించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించడం పార్టీ అంతర్గత సంక్షోభాన్ని మరింత బహిర్గతం చేసింది.
కొండా సురేఖ తన రక్షణ కోసం బీసీ సామాజిక వర్గ మద్దతును గట్టిగా తెరపైకి తెచ్చారు. అన్ని బీసీ సంఘాలు తనకు మద్దతుగా తీర్మానాలు చేస్తున్నాయని, బీసీ నాయకురాలిని టార్గెట్ చేయడం ప్రభుత్వ భవిష్యత్తుకే చేటని ఆమె వర్గం వాదిస్తోంది. అయితే, ఒక కేబినెట్ మంత్రి ముఖ్యమంత్రి అధికారాన్ని, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలను బహిరంగంగా సవాలు చేయడాన్ని ఉపేక్షిస్తే కేబినెట్ సమష్టి బాధ్యత దెబ్బతింటుందని అధిష్ఠానం భావిస్తోంది. మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారికంగా గవర్నర్‌ను కోరడమే తరువాయి అని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గురువారమే ఈ కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తుండటంతో, తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ అధ్యాయం ముగింపు దశకు చేరుకుందన్న విశ్లేషణలు బలం చేకూరుతున్నాయి.








