యువత విలువలు, కష్టపడేతత్వం అలవర్చుకోవాలి : మంత్రి లోకేష్
విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడమే లక్ష్యం
ఉన్నత విద్య బలోపేతంపై ప్రభుత్వం దృష్టిసారించింది
యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
విలువలు లేని వికసిత్ భారత్.. వికసిత్ భారత్ కాదు
నర్సరావుపేట జేఎన్ టీయూ విద్యార్థులతో ముఖాముఖిలో మంత్రి లోకేష్
నర్సరావుపేట: విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు విలువలు, కష్టపడేతత్వం అలవర్చుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కాకానిలోని జేఏఎన్ టీయూకే ఇంజనీరింగ్ కళాశాల నూతన వసతి గృహాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థినీ, విద్యార్థులతో మంత్రి ముఖాముఖీ నిర్వహించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు, కళాశాలల్లో అద్భుతమైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు. అనేక కారణాల వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అకడమిక్ కేలండర్ ప్రకారం అన్ని జరగాల్సిన అవసరం ఉంది. గత రెండేళ్ల కాలం పాఠశాల విద్య బలోపేతానికి చర్యలు తీసుకున్నాం. అనేక సత్ఫలితాలు వచ్చాయి. నేను మంత్రి అయినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ల్యాబ్స్, స్కిల్ సెంటర్స్, పరిశ్రమలతో అనుసంధానంపై దృష్టి పెట్టాం. ఇంజనీరింగ్ నాలుగేళ్లు చదివిన తర్వాత ఉద్యోగాలు రావాలి. అందుకే కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాం. ఇవన్నీ ఒక్కరోజులో జరగవు.
విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడమే లక్ష్యం
విద్యావ్యవస్థలో మార్పు రావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. నేను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేసినప్పుడు చాలా సులభంగా ఉండేది. విద్యాశాఖలో ఆ విధంగా చేయలేం. విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలి. ఒక ఎకోసిస్టమ్ ను నిర్మించాలి. విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావాలనేది నా డ్రీమ్. ప్రజాప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నాం. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటి క్లస్టర్లను ఏర్పాటుచేస్తున్నాం. జీవితంలో ఏదైనా సాధించాలంటే యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
కరిక్యులమ్ ను ప్రక్షాళన చేస్తున్నాం
రాష్ట్రంలో కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలు వచ్చాయి. త్వరలో మరిన్ని కంపెనీలు రాబోతున్నాయి. ఆటోమోటివ్ రంగంలో అనేక పరిశ్రమలను తీసుకువచ్చాం. ఫిజిక్స్, మెటీరియల్ సైన్సెస్, స్పేస్, థర్మోడైనమిక్స్ వంటి సబ్జెక్టులపైనా దృష్టిసారించాలి. దేశంలో ఐఐటీ, ఎన్ఐటీలు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయా కాలేజీల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంది. రాష్ట్రంలో కూడా ఉన్నత విద్య బలోపేతానికి కృషిచేస్తున్నాం. టీచర్లు, విద్యార్థులు ఎంత మంది ఉన్నారో తెలియని పరిస్థితి. వీటన్నింటినీ డిజిటైజ్ చేస్తున్నాం. హాజరును సమీక్షిస్తున్నాం. రీసెర్చ్ పైనా దృష్టిసారిస్తున్నాం. దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు సత్వర ఫలితాల సాధనకు కసరత్తు చేస్తున్నాం. మరోవైపు పరిశ్రమల నిపుణులతో సంప్రదించి కరిక్యులమ్ ను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మనం నేర్చుకున్నది పరిశ్రమకు దగ్గరగా ఉండాలి. ప్లేస్ మెంట్స్ విషయంలో కూడా ప్రతి యూనివర్సిటీకి కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేట్లర్లు(కేపీఐ) తీసుకువస్తున్నాం.
పల్నాటి ప్రజల అభిమానం మర్చిపోలేనిది
పల్నాడుకు, అనకాపల్లికి తేడా ఏంటని ఈ సందర్భంగా ఓ విద్యార్థినిని మంత్రి ప్రశ్నించారు. అనకాపల్లిలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ వరి పండిస్తే..అక్కడ చెరకు పండిస్తారని సదరు విద్యార్థిని బదులిచ్చారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ యువగళం అనుభవాలను గుర్తుచేసుకున్నారు. పల్నాడులో పాదయాత్ర చేస్తున్నప్పుడు మా కార్యకర్త నా చేయి తీసుకున్నాడు. ప్రేమ చూపిస్తున్నాడేమో అని భావించా. కానీ నా చేతిని కొరికాడు. ప్రేమను వ్యక్తం చేయడం తెలియక అలా చేశాడు. ఇక్కడివారు ప్రేమను, అభిమానాన్ని మొరటుగా చూపిస్తారు. మరోవైపు గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువెళ్లడం జరుగుతోంది. సీఎం గారు బుధవారం ఆ కార్యక్రమం కోసమే వెళ్లారు. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటిదశను పూర్తిచేసుకోవడం జరిగింది. ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్ అనకాపల్లికి వచ్చిందన్నారు.
విలువలు లేని వికసిత్ భారత్.. వికసిత్ భారత్ కాదు
విలువలు లేని వికసిత్ భారత్.. వికసిత్ భారత్ కాదు. నేను స్టాన్ ఫోర్డ్ లో విలువలు నేర్చుకున్నాను. స్టాన్ ఫోర్డ్ లో పరీక్షలు రాసే సమయంలో ఇన్విజిలేటర్లు ఉండరు. ఎవరూ కాపీ కొట్టరు. దీనివల్ల వ్యక్తిత్వం నిర్మితమవుతుంది. అవకాశాలు అనేకం ఉన్నాయి. అయితే కష్టపడాలి. విజయానికి దగ్గరి దారులు లేవు. కష్టపడటం ఒక్కటే మార్గం. ధీరూభాయ్ అంబానీ ఎంత కష్టపడ్డారో అందరం చూశాం. ముఖేష్ అంబానీ, అదానీ, ప్రధాని మోదీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంతో కష్టపడతారు. 76 ఏళ్ల వయసులోనూ 18 గంటల పాటు కష్టపడతారు. మనం కూడా అదేవిధంగా కష్టపడాలి. నేను అనేక దేశాలు చూశాను. ఏ దేశంలో చూసినా కనీసం రెండు జనరేషన్లు త్యాగం చేశారు. అంటే కష్టపడ్డారు. సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, రష్యాలో దీనిని చూశాను. సింగపూర్ ను లీన్ క్వాన్ యూ ఏవిధంగా మార్చారో మనం చూశాం.
యువత విలువలు, కష్టపడేతత్వం అలవర్చుకోవాలి
యువత విలువలు, కష్టపడేతత్వం అలవర్చుకోవాలి. ప్రభుత్వం నుంచి మేం చేయాలో అది చేస్తాం. అవకాశాలు కల్పిస్తాం. పరిశ్రమలు తీసుకువస్తున్నాం. ఇందుకు పరిశ్రమలకు అనేక రాయితీలు ఇస్తున్నాం. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్యాషన్ లేకపోతే మనం విజయం సాధించలేం. రాజకీయాలంటే ప్యాషన్ ఉంది కాబట్టే 24 గంటలు కష్టపడుతున్నా. కుటుంబాన్ని వారానికోసారి మాత్రమే కలుస్తా. చంద్రబాబు గారు 18 గంటలు కష్టపడుతుంటే నేను కనీసం 20 గంటలైనా కష్టపడాలి కదా.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
యువగళం పాదయాత్రలో నేను ప్రతిరోజూ నేర్చుకున్నాను. స్టాన్ ఫోర్డ్ ఎంబీయే బిజినెస్ కు పనికిరాగా.. పాదయాత్ర రాజకీయాల్లో పనికివచ్చింది. ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకోగలుగుతున్నా. పాదయాత్రలో వచ్చిన ఆలోచనే 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఇందుకోసం అందరం అహర్నిశలు కష్టపడతామని మంత్రి వివరించారు.








