చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్
గొడ్డలిపార్టీ సొంతవాళ్లని చంపి మనపై నెడుతుంది
టిడిపి కేడర్ అప్రమత్తంగా ఉండాలి
డీఎస్సీపై ఆరోపణలు చేసి పారిపోవడం కాదు… వాస్తవాలు ఉంటే ధైర్యంగా చర్చకు రండి
స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీలతో కూటమి అభ్యర్థులు గెలుపొందాలి
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదు
నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్
నర్సరావుపేట: 2019లో బాబాయిని కిరాతకంగా చంపేసి, చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్తచరిత్ర అని అవినీతి విషపుత్రిక సాక్షి పేపర్ లో రాశారు. అదేమని అడిగితే చిన్నపిల్లాడు, తెలియక చంపేశాడని తమ తమ్ముడిని సమర్థించడం జగన్ రెడ్డికే చెల్లుతుందని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. నర్సరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ… మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతలలో ఒక చెన్నారెడ్డి అనే వ్యక్తి చనిపోతే, ఏపీలో జంగిల్ రాజ్ అని జగన్ ట్వీట్ వేశారు. జగన్ చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి బ్రహ్మారెడ్డి చంపాడు కదా అంటే గొడ్డలి పార్టీ కార్యకర్తలే తన బిడ్డను చంపారని చెప్పాడు. బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి, ఆ నెపాన్ని మనపై వేసే ప్రబుద్దుడు జగన్. తెలుగుదేశం పార్టీకి తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బిసి సెల్ వంటి అనుబంధ విభాగాలు ఉన్నాయి. గొడ్డలిపార్టీకి గంజాయి, బూతులు, మహిళలను అవమానించే అనుబంధ విభాగాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో రెండోతరం, మూడోతరం వచ్చింది. వైసిపిలో భూకబ్జాలు, హిట్ అండ్ రన్, భార్యను వేధించే నాయకులు వచ్చారు. గొడ్డలిపార్టీ అరాచకాలన్నింటినీ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. వైసిపి దుష్ప్రచారాలను టిడిపి కేడర్ సమర్థవంతంగా తిప్పికొట్టాలి.
పార్టీ కోసం పనిచేస్తే పదవులు వెదుక్కుంటూ వస్తాయి
పల్నాడుకు ముఖద్వారం, పౌరుషాల పురిటిగడ్డ నర్సరావుపేట. ఎంతోమంది గొప్పనాయకులను తయారుచేసిన నేల నర్సరావుపేట. ఏపీకి తొలి స్పీకర్ వెంకట్రామయ్య చౌదరి. ఉమ్మడి రాష్ట్ర 3వ సిఎం కాసు బ్రహ్మానందరెడ్డి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్రవిభజన తర్వాత తొలి స్పీకర్ గా పనిచేసిన పల్నాడు పులి కోడెల శివప్రసాద్ వంటి నేతలను అందించిన ఈ నేల అభివృద్ధికి కారణం తెలుగుదేశం పార్టీ. టిడిపి ఆవిర్భావానికి ముందు పల్నాడు అంటే ఫ్యాక్షనిజంగా పేరుండేది. కోడెల ఎమ్మెల్యే అయ్యాక ఫ్యాక్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. అభివృద్ధి చేసి చూపించారు. 2019లో ఓడిపోయినా అరవిందబాబు కార్యకర్తలకు అండగా నిలబడి తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపి, ఎమ్మెల్యే అద్భుతంగా కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవు. తెలుగుదేశం అనే ఒకే ఒక వర్గం మాత్రమే ఉంటుంది. వర్గాలపేరుతో కావాలని కొందరు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. నేను ఈరోజు రాష్ట్రమంత్రిగా మీ ముందు నిలబడటానికి కారణం తెలుగుదేశం. కార్యకర్తలు నాతో లేకపోతే నేను ఎవరు? పనిచేసే కార్యకర్తలను గుర్తించే బాధ్యత నాది. 2025 మహానాడులో నా మనసుకు దగ్గరైన శాసనం కార్యకర్తే అధినేత. పార్టీ ఆవిర్భావం రోజున కార్యకర్తలను అధినేత పక్కన కూర్చోబెట్టాం. మంత్రులంతా కింద కూర్చున్నారు. పార్టీ కోసం మీరు పనిచేస్తే ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు, పదవులు వెదుక్కుంటూ మీవద్దకు వస్తాయి.
డిఎస్సీ ఆరోపణల్లో నిజం ఉంటే నిలబడి నిరూపించాలి
డిఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. 150కేసులు వేసినా 150రోజుల్లో విజయవంతంగా మెగా డిఎస్సీ నిర్వహించి 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. రాబోయే రోజుల్లో మరో 3డిఎస్సీలు ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీచేసే బాధ్యత నాది. డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ తో చర్చకు నేను రెడీ. ఆరోపణలు చేసి పారిపోవడం కాదు, వారి ఆరోపణల్లో వాస్తవాలు ఉంటే ధైర్యంగా నిలబడి నిరూపించాలి. రాష్ట్రంలో గ్రూప్ -1, గ్రూప్ -2 పోస్టులు భర్తీచేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా. లక్షలాది యువత కలలు నెరవేరుస్తా. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి నేను చెప్పాల్సిన పనిలేదు.
కార్యకర్తలకు ఉచితంగా మందులు అందిస్తాం
కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160కోట్లు ఖర్చుపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కోటిమంది సభ్యులు గల అతి పెద్ద కుటుంబం, సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుందాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బూత్ కీలకమైంది. మై టిడిపి యాప్ ద్వారా పనిచేసే కార్యకర్తలను గుర్తించి, నామినేటెడ్ పదవులు ఇస్తాం. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయండి. చేసిన పనిని మైటిడిపి ద్వారా తెలియజేయండి. క్లస్టర్, యూనిట్ నాయకులకు కేంద్ర కార్యాలయంలో ట్రైనింగ్ ఇచ్చాం. శిక్షణకు వచ్చిన వారికి రక్తపరీక్షలు చేయిస్తే, 75శాతం మందికి వివిధ వ్యాధులు ఉన్నాయి. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తాం. జీవితాంతం వారికి మందులు అందించే బాధ్యత నాది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు అందరిపైనా ఉంది.
బిసిలకు తీరని ద్రోహం చేసిన జగన్
జగన్ సిఎం అయ్యాక స్థానిక సంస్థలకు బిసిలకు 10శాతం రిజర్వేషన్ తగ్గించి, 17వేల పదవులకు దూరం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బిసిలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్ తీర్మానం చేశాం. వాటిని కూడా వైసిపి నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నారు. 2019-24 నడుమ బిసి బిడ్డలను అతి కిరాతకంగా వైసిపి నాయకులు చంపేశారు. తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ ను కిరోసిన్ పోసి తగులబెట్టారు. తోటచంద్రయ్య, నందం సుబ్బయ్యలను దారుణంగా హతమార్చారు. మాజీ మంత్రి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి, పారిపోయాడు. అప్పలరాజు మరొక వ్యక్తిని ప్రవేశపెట్టాడు. చనిపోయింది యాదవ సామాజికవర్గ వ్యక్తి. కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. జగన్ బడా చోర్ అయితే…కారుమూరు నాగేశ్వరరావు చోటా చోర్. మద్యం రవాణాలో అక్రమ సొమ్ము కోడలు ఎకౌంట్ లో జమచేశాడు. ఈ కేసులో ఈడి ఆయనను జైలుకు పంపితే మనపై నెపం వేస్తున్నారు. వైసిపి దుష్ప్రచారాలపై కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి.
స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలి
మరో నెలరోజుల్లో రానున్న మున్సిపల్, పంచాయితీ, ఎంపిటిసి, జడ్ పిటిసి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎప్పడు లేనివిధంగా భారీ మెజారిటీతో గెలుపొందాలి. ప్రస్తుతం మనం జనసేన, బిజెపితో కలసి ముందుకు వెళ్తున్నాం. 2029లోనే కాదు, మరో మూడుసార్లు కూటమిగానే కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లి గెలుస్తాం. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. నో మిస్ ఫైర్, నో క్లాస్ ఫైర్. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో నేతృత్వాన డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. పెద్దఎత్తున ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, జీతాలు, పెన్షన్లకు కేంద్రం సహకారం ఉంది. కార్యకర్తలు ఇగో, అహంకారాలకు దూరంగా ఉండాలి. ప్రజలతో కనెక్ట్ కావాల్సిన బాధ్యత కేడర్ పై ఉంది. ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలి. ప్రతి గడపా తొక్కాలి. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలే ప్రసక్తిలేదు
కొందరు రెడ్‌బుక్ అంటే భయపడుతున్నారు. ఇది కార్యకర్తలకు ఇచ్చిన హామీ కాదు, యువగళంలో సుమారు వంద మీటింగ్ లలో ఈ విషయాన్ని చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని మరోసారి లోకేష్ స్పష్టం చేశారు. నర్సరావుపేట ఐటిఐకి స్టాఫ్ కావాలని ఎంపి కృష్ణదేవరాయలు కోరారు. నూటికి నూరుశాతం ఐటిఐకి స్టాఫ్ ఇస్తాం. నర్సరావుపేటకు యూనివర్సిటీ అడిగారు, ఈ విషయమై బాబు గారితో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ…లోకేష్ చొరవ వల్లే రాష్ట్రానికి గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయి. జెఎన్ టియు కళాశాలలో రూ.70కోట్లతో హాస్టల్ భవనాలను ప్రారంభించారు. నర్సరావుపేట జెఎన్ టియును యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిస్థానాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జివి ఆంజనేయులు, నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు జానీ సైదా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్, జోనల్ కోఆర్డినేటర్ బిటి నాయుడు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి, నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్ కోవెలమూడి నాని తదితరులు పాల్గొన్నారు.








