ధిక్కార స్వరాలపై కాంగ్రెస్ కొరడా..!?
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ బహిరంగ విమర్శలకు దిగుతున్న సీనియర్ నాయకులపై అధిష్టానం కఠిన వైఖరి అవలంబిస్తోంది. మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డిలపై వేటు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న వేళ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆశించిన మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో రగులుతున్న రాజగోపాల్ రెడ్డి, పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా వలస నాయకులు పార్టీని కబ్జా చేస్తున్నారు అంటూ బహిరంగంగానే స్వరం పెంచుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పగ్గాలు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేస్తూ, వైఎస్సార్ హయాం నాటి అసలైన కాంగ్రెస్‌ను మళ్లీ తెస్తామంటూ కొత్త చర్చకు తెరలేపారు. అయితే క్రమశిక్షణా కమిటీ కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, రాజగోపాల్ రెడ్డికి నోటీసు ఇవ్వకపోవడం వెనుక పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి తన వాదన వినిపించారని, తుది నిర్ణయం హైకమాండ్‌దేనని పేర్కొంటూనే, నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్పై పోరాడిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలంటూ తన పాత నినాదాన్ని మరోసారి ప్రస్తావించారు.
రాజగోపాల్ రెడ్డి వరుస వ్యాఖ్యలతో సరిహద్దులు దాటుతున్నప్పటికీ, హైకమాండ్ ఇప్పటివరకు సంయమనం పాటిస్తూ వచ్చింది. నల్లగొండ జిల్లాలో ఆయనకున్న రాజకీయ ప్రభావం, పార్టీ సమీకరణాల దృష్ట్యా ఆయన్ను నేరుగా టార్గెట్ చేయకుండా వేచిచూసే ధోరణిని ప్రదర్శించింది. అయితే, ఒకసారి కొండా సురేఖపై చర్యలు పూర్తయిన తర్వాత ఇలాంటి అంతర్గత ధిక్కార స్వరాలు సద్దుమణుగుతాయని అధిష్టానం అంచనా వేస్తోంది. ఒకవేళ ఆ తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి గీత దాటితే, తొలుత ఆయన్ను ఢిల్లీకి పిలిపించి హెచ్చరించాలని, అప్పటికీ వైఖరి మారకపోతే వేటు వేసేందుకు సైతం వెనుకాడకూడదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
ఇవి కూడా చదవండి
ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అంటూ విభజన రేఖలు గీసి పాలనను, పార్టీని అస్థిరపరిచే ప్రయత్నాలను ఇక ఎంతమాత్రం సహించకూడదని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తే అది పార్టీ చేతకానితనంగా మారుతుందన్న ఆందోళన ఏఐసీసీ నాయకత్వంలో వ్యక్తమవుతోంది.
మరోవైపు, రేవంత్ రెడ్డి వర్గం కూడా ఈ వాదనలను బలంగా తిప్పికొడుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ వరుస ఎన్నికల్లో పార్టీ ఎందుకు పరాజయం పాలైందో ఈ విమర్శకులు సమాధానం చెప్పాలని రేవంత్ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి కష్టపడటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హైకమాండ్ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ నాయకత్వానికే పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటు పడితే, తదుపరి పర్యవసానాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.








