కొత్త పింఛన్లు.. స్థానిక ఎన్నికలు కోసం లోకేష్ కీలక వాఖ్యలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశల వారీగా కొత్త ఫించన్లు (New pensions) ఇవ్వాలని మంత్రి లోకేశ్ (Lokesh) అన్నారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో సమావేశమైన లోకేశ్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ కొత్త ఫించన్లు ఇవ్వాలని తెలిపారు. స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధమవ్వాలని, అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోర్టు పెండింగ్‌లో ఉన్నవి కూడా త్వరితగతిన పరిష్కరించుకుని అన్నింటిలో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తొలుత పురపాలికలు, తర్వాత ఎంపీటీసీ ( MPTC), జెడ్పీటీసీ (ZPTC)లు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగి రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే దురుద్దేశంతో ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
విద్యా శాఖను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు పన్నుతున్న కుట్రల పట్ల తనతో పాటు సంబంధిత మంత్రులూ అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ సూచించారు. మాట వినని అధికారుల్ని ఉపేక్షించేది లేదన్నారు. కొందరు అధికారుల పనితీరు శాఖకు, మంత్రికి చెడ్డపేరు తెచ్చేలా ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరు అధికారుల తీరు వల్లే ఇటీవల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పుకొచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని తప్పు పడుతూ కొందరు ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపైనా మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్ 9న అధినేత చంద్రబాబు (Chandrababu)పై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా నిర్బంధించి 3ఏళ్లు అవుతుందని, నాటి దుశ్చర్య నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అందరికీ గుర్తు చేసేలా ఓ కార్యక్రమానికి రూపకల్పన చేద్దామన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు, పొదుపు చర్యలతో సమస్యను అధిగమిద్దామని పేర్కొన్నారు.








