విజయవాడ దసరా ఉత్సవాల షెడ్యూల్ విడుదల..!
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ(Kanakadurgamma Temple) ఆలయంలో జరిగే దేవీ శరన్నవరాత్రుల (దసరా) మహోత్సవాల అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు దసరా దేవీ శరన్నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ ఈవో మరియు వైదిక కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. మునుపటి కంటే ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, ఘాట్ రోడ్డు ప్రయాణం, ప్రసాదాల పంపిణీ విషయంలో ఆలయ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ దసరా శరన్నవరాత్రుల అలంకారాల పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అక్టోబర్ 11వ తేదీన ఉత్సవాల మొదటి రోజు దుర్గమ్మ తల్లి శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది. ఆ తర్వాతి రోజు అక్టోబర్ 12న శ్రీ గాయత్రీదేవిగా, 13న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 14న శ్రీ మహాచండీదేవిగా, 15న శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారాలలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహించనుంది. ఇక అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం రోజున అంటే అక్టోబర్ 16వ తేదీన అమ్మవారు చదువుల తల్లి శ్రీ సరస్వతిదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనుండగా, ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
నవరాత్రుల ముగింపు దశలో అక్టోబర్ 17న శ్రీ మహాలక్ష్మీదేవిగా, 18న శ్రీ దుర్గాదేవిగా, 19న శ్రీ మహిషాసురమర్థినిగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కొలువుదీరనున్నారు. చివరి రోజు అక్టోబర్ 20వ తేదీన శ్రీ రాజరాజేశ్వరిదేవి అవతారంతో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగుస్తాయి. అదే రోజు అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం కృష్ణా నదిలో అత్యంత వేడుకగా, కనులపండువగా సాగే హంస వాహనంపై దుర్గమ్మ తెప్పోత్సవం నిర్వహించనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇంద్రకీలాద్రి దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్నారు.








