వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ మాస్టర్ ప్లాన్..!
భారత క్రికెట్ రంగంలో సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న 15 ఏళ్ల యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ స్థాయిలో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ బుడతడి కెరీర్‌ను చాలా జాగ్రత్తగా, ఆచితూచి మలచాలని బోర్డు నిర్ణయించింది. వైభవ్ కేవలం ఒకటి రెండు సిరీస్‌లకే పరిమితం కాకుండా, సచిన్ టెండూల్కర్ లాగా సుదీర్ఘ కాలం పాటు టీమిండియాకు ఆడేలా తీర్చిదిద్దడమే తమ అసలు ప్లాన్ అని బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా సంచలన విషయాలు వెల్లడించారు.
ఇటీవల ముగిసిన ఒక కీలక సమీక్షా సమావేశం అనంతరం దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బోర్డుకున్న ఆలోచనలను పంచుకున్నారు. “15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆటగాడు ఇంతటి ప్రభావం చూపించడం బీసీసీఐకి ఎంతో గర్వకారణం. కానీ, మేము చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. వైభవ్ తీసుకునే ప్రతి అడుగు సరైనది కావాలి. అతడు కేవలం ఒక సిరీస్ లేదా ఒక్క ఏడాది మెరిసి మాయమైపోయే వండర్ కాకూడదన్నదే మా తాపత్రయం” అని సైకియా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
గతంలో సచిన్ టెండూల్కర్ మరియు ఇతర క్రికెట్ దిగ్గజాలు చిన్న వయసులో జట్టులోకి వచ్చినప్పుడు బోర్డు ఎలాంటి నిఘా, పర్యవేక్షణ పెట్టిందో.. ఇప్పుడు వైభవ్ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నట్లు సైకియా తెలిపారు. “మేము వైభవ్ ఎదుగుదలను ప్రతి కోణంలోనూ నిశితంగా గమనిస్తున్నాం. అతని కెరీర్లో వేసే ప్రతి అడుగుపై బోర్డు ప్రత్యేక నిఘా పెట్టింది. అతనికి అవసరమైన అన్ని రకాల మార్గదర్శకాలను, సహాయాన్ని బీసీసీఐ అందిస్తుంది” అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగబోయే ఏషియన్ గేమ్స్ లో భారత పురుషుల, మహిళల టీ20 జట్లకు కల్పించబోయే వసతులపై కూడా సైకియా కీలక అప్డేట్ ఇచ్చారు. అక్కడ వసతులపై వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ.. తమ ఆటగాళ్ల సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్లేయర్స్ ఎవరూ రూమ్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ నిర్వాహకుల నుంచి ఏవైనా లోపాలు జరిగితే బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగి సొంతంగా ప్లేయర్లకు అత్యుత్తమ వసతులు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కాగా, ఈ టోర్నీ కోసం పురుషుల జట్టుకు క్రూయిజ్ షిప్లో, మహిళల జట్టుకు హోటల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.








