సెలెక్టర్ల ‘రిటైర్మెంట్’ ప్లాన్‌కు రోహిత్ శర్మ షాక్..?
టీమిండియా వన్డే భవిష్యత్తు మరియు 2027 ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌పై ముంబైలో జరిగిన బీసీసీఐ (BCCI) రివ్యూ మీటింగ్ భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద తుఫాన్‌ను రేపింది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్కు సంబంధించి సెలెక్షన్ కమిటీ తెరవెనుక నడిపిన ఒక రహస్య వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గత జూలైలో ఇంగ్లండ్ టూర్ జరుగుతున్న సమయంలో, సెలెక్షన్ కమిటీకి చెందిన ఒక సభ్యుడు రోహిత్ శర్మను కలిసి.. ‘బోర్డు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది’ అని చెప్తూ లార్డ్స్ వన్డే ముగిసిన వెంటనే వన్డేల నుంచి తప్పుకోవాలని కోరినట్లు జాతీయ మీడియా సంచలన విషయాలను బయటపెట్టింది.
ఈ ప్రతిపాదనపై ‘హిట్‌మ్యాన్’ తీవ్ర ఆగ్రహానికి గురైనప్పటికీ, అప్పట్లో ఆ నిర్ణయానికి అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ సెలెక్టర్లు వేసిన స్కెచ్‌ను రోహిత్ శర్మ తన బ్యాటింగ్‌తో తిరగరాశారు. లార్డ్స్‌లో జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ 138 పరుగులతో ఊచకోత కోసి అద్భుతమైన సెంచరీ బాదడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే, ఈ గ్యాప్‌లో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ఎంట్రీ ఇచ్చి ‘రోహిత్ శర్మ వన్డేల నుంచి తప్పుకోవడం లేదు’ అని అధికారిక ప్రకటన చేయడం.. బోర్డు పెద్దలకు, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీకి మధ్య పెద్ద వివాదానికి కారణమైంది.
బోర్డు నిర్ణయాన్ని కాదని రోహిత్‌ను తప్పుకోవాలన్నందుకు.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఉద్యోగానికే ఎసరు వచ్చినట్లు తెలుస్తోంది. 2027 వరల్డ్‌కప్ వరకు పదవిలో ఉండాలని చూస్తున్న అగార్కర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మన్ ను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా తీసుకురావడానికి బీసీసీఐ వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు, రోహిత్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలపై ఎలాంటి రిటైర్మెంట్ ఒత్తిడి లేదని, వారు వచ్చే ఏడాది ఆఫ్రికాలో జరిగే ఐసీసీ టోర్నీల ప్లాన్స్‌లో సేఫ్‌గా ఉన్నారని స్పష్టమైంది. లార్డ్స్ సెంచరీతో రోహిత్ తన స్థానాన్ని ప్రస్తుతానికి కాపాడుకున్నప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ నాటికి ఆయన వయసు రీత్యా జట్టులో ఉంటారా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కానీ, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నమెంట్లలో కేవలం మెరుపులు మాత్రమే సరిపోవని, ఒత్తిడిని తట్టుకునే మానసిక దృఢత్వం, అపారమైన అనుభవం చాలా ముఖ్యమని.. మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.








