దుల్కర్ సినిమాకు రిలీజ్ కష్టాలు.. కంటెంట్ ఆలస్యంతో నష్టాల ముప్పు!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer salman) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఐ యామ్ గేమ్(I am game) రిలీజ్ విషయంలో ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రమోషన్ల టైమ్ లో తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇదేనని దుల్కర్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమాను ఆయన సొంత నిర్మాణ సంస్థ వే ఫేరర్ ఫిల్మ్స్ నిర్మించడం మరింత ప్రత్యేకతను తెచ్చింది. అయితే రిలీజ్ టైమ్ కు కంటెంట్ రెడీ అవకపోవడంతో తెలుగు, తమిళ వెర్షన్ల షోలు నిలిచిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రిలీజ్ ను ఇప్పటికే రెండు వారాలు వెనక్కి జరిపినా కూడా అన్ని భాషలకు సంబంధించిన కంటెంట్‌ను సకాలంలో అందించలేకపోవడం నిర్మాతలకు పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ మార్కెట్లలో దుల్కర్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో తొలి రోజు రావాల్సిన ఓపెనింగ్స్‌పై ఈ ఆలస్యం.. ప్రభావం చూపనుంది.
భారీ బడ్జెట్ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్లు కీలకం కావడంతో, ఈ పరిస్థితి ఆర్థికంగా కూడా ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి. నహాస్ హిదయత్(nahas hidayat) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్(Anthony vargis), మిస్కిన్(Myskin), కాయదు లోహర్(Kayadhu Lohar), సంయుక్త విశ్వనాథన్(Samyuktha vishwanathan) కీలక పాత్రల్లో నటించారు. నిర్మాతగా స్వయంగా వ్యవహరిస్తున్న దుల్కర్‌కు ఈ రిలీజ్ గందరగోళం ఎంతవరకు నష్టం తెస్తుందో చూడాలి.








