రోలెక్స్ తో లోకేష్ కనగరాజ్ భారీ ప్లాన్?
తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) కెరీర్లో మైలురాయిగా నిలవబోతున్న 50వ సినిమాపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, సూర్య 50వ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తెరకెక్కించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. విక్రమ్(Vikram) సినిమాలో కొద్దిసేపు కనిపించినప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సూర్య క్యారెక్టర్ రోలెక్స్ ను పూర్తి స్థాయి సినిమాగా రూపొందించే ప్రయత్నాలు మళ్లీ వేగం అందుకున్నట్లు సమాచారం.
రోలెక్స్ క్యారెక్టర్ కు వచ్చిన మంచి రెస్పాన్స్ నేపథ్యంలో ఈ క్యారెక్టర్‌కు ప్రత్యేకంగా సినిమా చేయాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఇదొకటి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక సినిమాకు నిర్మాతను ఖరారు చేసే ప్రక్రియ జరుగుతుండగా, ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను(Kalaipuli S. Thanu) పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అంశాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
ఇక సూర్య ప్రస్తుతం తన 48వ సినిమాను టీజే జ్ఞానవేల్(TJ Gnanavel) దర్శకత్వంలో పూర్తి చేసే పనిలో ఉన్నారు. అనంతరం హెచ్. వినోద్(H. Vinod)తో తన 49వ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా పూర్తైన తర్వాత లోకేష్ కనగరాజ్ రోలెక్స్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టవచ్చని సమాచారం. ఈ కాంబినేషన్ నిజమైతే సూర్య కెరీర్లో 50వ సినిమా అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి.








