శివ నిర్వాణ నెక్ట్స్ హీరో అతనేనా?
ఇరుముడి(Irumudi) గ్రాండ్ సక్సెస్ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva nirvana) కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది. గతంలో ఖుషి(Kushi) లాంటి సినిమాతో ఎదురైన నిరాశ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కథలపై దృష్టి పెట్టిన శివ నిర్వాణ, ఇరుముడితో భారీ సక్సెస్ ను అందుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తర్వాత ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న ఆసక్తి పెరిగిన వేళ, తమిళ స్టార్ హీరో ధనుష్‌తో మరోసారి డిస్కషన్స్ ప్రారంభమైనట్లు సమాచారం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇరుముడి సినిమాకు ముందే ధనుష్(Dhanush)తో ఓ ప్రాజెక్ట్ కోసం శివ నిర్వాణ డిస్కషన్స్ జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇరుముడి విజయంతో ఆ ప్రయత్నాలకు మళ్లీ వేగం వచ్చినట్లు టాక్. ఇరుముడి రిలీజైన తర్వాత శివ నిర్వాణ ధనుష్‌తో వీడియో కాల్లో మాట్లాడిన సందర్భం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమాలో కీలక పాత్రలో నటించిన చిన్నారి నక్షత్ర(Nakshatra)తో ధనుష్ మాట్లాడటం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఆ వీడియో ఇప్పుడు ఈ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలకు మరింత ఆయువుని అందిస్తోంది.
అయితే శివ నిర్వాణ తన తర్వాతి సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్(Shine Screens Banner)లో చేయాల్సి ఉంది. ధనుష్‌తో స్టోరీ డిస్కషన్స్ సానుకూలంగా సాగితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళం, హిందీలో బిజీగా ఉన్న ధనుష్ షెడ్యూల్స్‌ను బట్టి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇరుముడి తర్వాత శివ నిర్వాణ ఎలాంటి కథతో వస్తారన్న ఆసక్తికి ఈ కాంబినేషన్ మరింత హైప్ తీసుకొచ్చింది.








