తానా పాఠశాల – ఉపాధ్యాయ దినోత్సవ వేడుక
అమెరికా రాజధాని వేదికగా తానా – పాఠశాల ఆద్వర్యంలో ప్రవాస భారతీయుల సమక్షంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఆచార్యులు, విద్యావేత్త మూల్పూరి వెంకట్రావు గారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి సమన్వయపరచారు. భారతదేశ రెండవ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును మననం చేసుకుంటూ వారికి ఘన నివాళి అర్పించారు.
అనాదిగా సమాజ పురోగతికి పునాది అయిన అక్షర జ్ఞానం, విజ్ఞానం అందిస్తూ, దిశానిర్దేశం చేస్తూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేసే నిస్వార్థ సేవలను, వారి కృషిని గుర్తించి గౌరవించుకోవడం సమాజాన్ని సంస్కరించుకోవటమే అని వెంకట్రావు అన్నారు.
ఇవి కూడా చదవండి
మాతృభూమి, మాతృబాష మన మూలాలుగా..తరాలు మారుతున్నా, విజ్ఞాన మాధ్యమాలు మారుతున్నా విజ్ఞానం అందించే గురు స్థానం శాశ్వతంగా పదిలమని అది మన సంస్కృతిలో భాగమని భాను ప్రకాష్ అన్నారు.
ప్రవాస భారతీయ పెద్దలు మాట్లాడుతూ గురు పరంపర మన ఘన చరిత్ర అని, తల్లిదండ్రుల తర్వాత మన ఉన్నతి, అభ్యున్నతిని తనను మించి తన శిష్యుడు ఎదగాలని కాంక్షించే నిస్స్వార్ధ భావం ఒక్క గురువుకే సాధ్యమని అందుకే భారతీయ ధర్మంలో ఆచార్య దేవోభవ అని కీర్తిస్తూ గురు స్థానాన్ని శిఖరాగ్రాన నిలబెట్టారన్నారు. ప్రవాస పెద్దలందరూ కలిసి ప్రొఫెసర్ వెంకట్రావు ను సన్మానించి అభినందించారు.








