ఇస్రో ప్రైవేటీకరణ? స్పష్టతనిచ్చిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ను ప్రైవేటీకరిస్తున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. దీనిపై రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఈ వార్తలను తాము ఖండిస్తున్నామని, ప్రైవేటీకరణ ఏమీ జరగదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గదని తేల్చి చెప్పింది. పరిశోధన, అభివృద్ధి, అత్యాధునిక సాంకేతికతలు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు, లాంఛ్ వ్యవస్థలు, డీప్ స్పేస్, గ్రహాంతర మిషన్ల వంటి అత్యంత కీలకమైన అంశాల్లో ఇస్రో పాత్ర బలోపేతమవుతోదని ప్రకటించింది.
కమ్యూనికేషన్, నేవిగేషన్, సెన్సర్లు… ఇలా రకరకాల వాటిని అభివృద్ధి చేస్తూనే వున్నామని, అదే సమయంలో మిగతా వాటిపై కూడా ఇస్రో దృష్టి సారించిందని పేర్కొంది.
మరో వైపు ప్రైవేటీకరణ వదంతులపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ కూడా స్పందించారు. ఇస్రో ప్రైవేటీకరణ కాదని తేల్చి చెప్పారు. తాము ఇస్రో ఉద్యోగుల్లో వున్న ఆందోళనల్ని పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. అంతరిక్ష రంగ సంస్కరణలు ఆరేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని, ప్రైవేట్ రంగానికి మార్గనిర్దేశం చేయడం, భారత అంతరిక్ష వ్యవస్థళను మరింత విస్తరించడం సంస్కరణల లక్ష్యమన్నారు. స్పేస్ ఇండస్ట్రీలో ప్రైవేట్ పరిశ్రమ కొత్తది కాదని, రాకెట్ల తయారీలో ఇప్పటికే వందలాది భారతీయ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.








