కరుగుతున్న ఖుంబు హిమానీ నదం.. హిమాలయాల్లో ఆందోళనకర పరిణామాలు..!
హిమాలయాల్లో ట్రెక్కింగ్ అంటే చాలా కష్టమైన పని. అయితే ఈ ట్రెక్కింగ్.. పర్వతారోహకులకు అంతే ఆసక్తి కలిగిస్తుంది. అందుకే ఏటా వేల సంఖ్యలో పర్వతారోహకులు… హిమాలయాల్లో పర్యటిస్తారు. ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల భారత్, చైనా, నేపాల్ కు పర్యాటక ఆదాయం కూడా లభిస్తోంది. అయితే ఇది నాణేనికి ఓవైపు మాత్రమే.. రెండు వైపు ప్రమాదం ముంచుకొస్తోంది.అదే హిమానీ నదం కరుగుదల.
ఇటీవల నేపాల్‌లో హిమానీ నదం కరుగుదలతో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్.. వేల ప్రాణాలను బలిగొన్నాయి. చాలా మందిని అనాథలుగా మార్చేశాయి. అపార ఆస్తినష్టం మిగిల్చాయి. ఈ తరుణంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఖుంబు హిమానీనదం కరుగుతోందన్న నివేదిక ఆందోళన కలిగిస్తోంది. బేస్ క్యాంప్‌లో పెరుగుతున్న మానవ కార్యకలాపాలు ఖుంబు హిమానీనదం కరుగుదలను మరింత పెంచుతున్నాయని తాజా అధ్యయనం తెలిపింది. వాతావరణ మార్పులతో పాటు ఇంధన వినియోగం, మనుషుల మూత్ర విసర్జనతో విడుదలయ్యే వేడి కూడా దీనికి కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ప్రతి క్లైంబింగ్ సీజన్లో వేలాది మంది పర్వతారోహకులు, పర్యాటకులు, గైడ్లు, సిబ్బందితో సందడిగా మారుతుంది. వంట, విద్యుత్, వేడి కోసం ఎల్పీజీ, కిరోసిన్, పెట్రోల్ వాడుతున్నారు. వీటి నుంచి భారీగా వేడి విడుదలవుతోంది. మనుషుల మూత్ర విసర్జనను కూడా పరిశోధకులు లెక్కల్లోకి తీసుకున్నారు.
2023 వసంతకాలంలో బేస్ క్యాంప్‌లో విడుదలైన మొత్తం వేడి 8,49,174 మెగాజౌళ్లుగా అంచనా వేశారు. ఈ వేడి దాదాపు 2,492 టన్నుల మంచును కరిగించగలదని అధ్యయనం వెల్లడించింది.1991 నుంచి 2023 వరకు ల్యాండ్సాట్ ఉపగ్రహ సమాచారాన్ని పరిశీలించగా బేస్ క్యాంప్ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏటా 0.28 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తేలింది. ఖుంబు హిమానీనదంతో పోలిస్తే ఇక్కడ వేడెక్కుతున్న వేగం దాదాపు రెండింతలుగా ఉంది.
ప్రస్తుతం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హిమానీనదంపైనే ఉంది. పరిస్థితులు మరింత దిగజారితే క్యాంప్‌ను తరలించాల్సి రావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. క్యాంప్‌కు నైరుతి దిశలో స్థిరమైన నేలపై రెండు ప్రత్యామ్నాయ ప్రాంతాలను కూడా గుర్తించారు.








