EOS-05 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. దేశ భద్రతకు అత్యంత కీలకం..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. అధునాతన EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 రాకెట్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి వేకువజాము 2:55 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. భూమిని మరింత స్పష్టంగా, నిరంతరం పరిశీలించేందుకు EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు.
51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువు ఉన్న GSLV-F17 రాకెట్ నిర్ణీత సమయంలో నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం తర్వాత EOS-05 ఉపగ్రహాన్ని నిర్దేశించిన సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (Sub-GTO)లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో ఉపగ్రహం తన తదుపరి కక్ష్య ప్రయాణాన్ని కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. EOS-05ను భారతదేశపు తొలి జియోసింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ శాటిలైట్‌గా పేర్కొంటున్నారు.
భూమికి దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్య నుంచి భూభాగాలను నిరంతరం పరిశీలించడం ఈ ఉపగ్రహం ప్రధాన ప్రత్యేకత. అలాగే శత్రు దేశాల కదలికలను గుర్తించడంతో పాటూ సరిహద్దుల పర్యవేక్షణలో ఈ శాటిలైట్ కీలకం కానుంది. ఈ ఉపగ్రహం ఒకే ఫ్రేమ్‌లో దక్షిణాసియాను మొత్తం ఫొటో తీయగలదు. భారత ఉపఖండం మొత్తాన్నీ కేవలం 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి పంపించగలదు. ప్రస్తుతం ఇస్రోకు ఉన్న సామర్థ్యంతో పోలిస్తే.. ఈ ఉపగ్రహం కెమెరా పిక్సెల్ డెన్సిటీ 567 రెట్లు మెరుగ్గా ఉండడం విశేషం. ఈ సాంకేతికతతో వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ పరిస్థితులు, అడవులు, నీటి వనరులు, పర్యావరణ మార్పులను సమర్థంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరదలు, తుపాన్లు, కరువు వంటి విపత్తుల సమయంలో సమాచారం వేగంగా అందించడంలో ఇది కీలకంగా మారనుంది. దేశ భద్రతకు సంబంధించిన పర్యవేక్షణ సామర్థ్యాలను కూడా ఈ ఉపగ్రహం మరింత బలోపేతం చేయనుంది.
ఇవి కూడా చదవండి
ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్యలు…
ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్ఎల్వీ ఎఫ్ 17 వాహక నౌక ద్వారా అడ్వాన్స్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఉపగ్రహాన్ని 170 కి.మీ. -29,000 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, రాకెట్ మరింత మెరుగైన పనితీరును కనబరిచి 171 కిమి/ 31,026 కి.మీ. కక్ష్యలోకి విజయవంతంగా చేర్చిందన్నారు. ఇస్రోకు ఈ ఆర్థిక సంవత్సరానికి ఇదే తొలి ప్రయోగం. రాకెట్ లోని అన్ని వ్యవస్థలూ అద్భుతంగా పనిచేయడంతో ఈ ప్రయోంగం సంపూర్న మైందన్నారు.
ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ…
జీఎస్ఎల్వీ F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడాన్ని దేశానికి గర్వమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో వున్న అత్యుత్తమ ప్రతిభ, ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు ప్రతిబింబం అని పేర్కొన్నారు.








