కొండా ఫ్యామిలీ ‘ప్లాన్-బి’ ఏంటి?
తెలంగాణ రాజకీయాల్లో దూకుడుకు మారుపేరైన కొండా కుటుంబం ఇప్పుడు అత్యంత కీలకమైన రాజకీయ సంధికాలంలో పడింది. అనూహ్య పరిణామాల మధ్య కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి పార్టీని వీడే ఆలోచన లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కొండా సురేఖ పైకి చెబుతున్నప్పటికీ, భవిష్యత్ కార్యాచరణపై తెరవెనుక జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.
కొండా సుస్మిత వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం తీవ్రరూపం దాల్చినప్పటికీ సురేఖ, ఆమె భర్త కొండా మురళి మొదటి నుంచీ వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా వివాదం నడుస్తున్న సమయంలోనే కొండా మురళి బాహాటంగా ప్రస్తావించిన ప్లాన్-బి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గం నుంచి సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత మురళి మీడియా ముందుకు వచ్చి మీసం తిప్పడం చూస్తుంటే, తాము ఇప్పటికే పక్కా ప్రణాళికతో ఉన్నారన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసరడమే ఆ ప్లాన్-బినా? అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, రాజీనామా నిర్ణయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఉమ్మడి వరంగల్ గడ్డపై రాజకీయ పట్టు నిలుపుకోవాలన్నా, ఉప ఎన్నిక వంటి సాహసోపేత నిర్ణయం తీసుకుని గెలవాలన్నా ఏదో ఒక ప్రధాన రాజకీయ పార్టీ అండ కొండా కుటుంబానికి తప్పనిసరి.
ఇవి కూడా చదవండి
కొండా దంపతుల రాజకీయ గతాన్ని పరిశీలిస్తే, రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరు వైఎస్సార్సీపీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో, ఆ పార్టీని వీడి అధినేత కేసీఆర్, కేటీఆర్ సహా ముఖ్య నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాటి వైరం దృష్ట్యా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వంతో మళ్లీ కలిసి పనిచేసే పరిస్థితి గానీ, ఆ పార్టీలో ఇమిడే అవకాశాలు గానీ ఏమాత్రం లేవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ వైఖరి కూడా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి అధికారిక ఆహ్వానం అందలేదు. కాషాయ పార్టీలో కొండా చేరికపై రాష్ట్రస్థాయి నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. వారి దూకుడు స్వభావం పార్టీ కేడర్‌కు ఎంతవరకు మేలు చేస్తుందనే దానిపై బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత కాంగ్రెస్‌లో గతంలో ఉన్న గౌరవం, ప్రాధాన్యత ఇకపై దక్కడం కష్టమనే అభిప్రాయం బలపడుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడే నాటికి ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నియోజకవర్గంలోని కేడర్, ప్రధాన అనుచరులతో సమాలోచనలు జరిపిన తర్వాతే కొండా దంపతులు ఒక స్పష్టమైన నిర్ణయానికి రావచ్చని తెలుస్తోంది. ఇతర ప్రధాన పార్టీల నుంచి వచ్చే రాజకీయ ప్రతిపాదనలు, భవిష్యత్ భరోసాలను బేరీజు వేసుకుంటూ, ఎలాంటి తొందరపాటు లేకుండా ఆచితూచి అడుగులు వేసే వ్యూహంలో కొండా కుటుంబం ఉంది. రాబోయే రోజుల్లో కొండా దంపతులు విసిరే రాజకీయ పాచికలు వరంగల్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యేలా కనిపిస్తున్నాయి.








