రేవంత్ వైపే కాంగ్రెస్ హైకమాండ్..! పట్టు నిరూపించుకున్న సీఎం!
తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగులేని రాజకీయ శక్తిగా తన స్థానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సుస్థిరం చేసుకున్నారు. గత కొద్దికాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు, కేబినెట్ మార్పులు, అసమ్మతి స్వరాలపై సాగుతున్న ప్రచారాలన్నింటికీ తన ఢిల్లీ పర్యటనతో ఆయన బలమైన చెక్ పెట్టారు. అధిష్టానం వద్ద తన నాయకత్వానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం తన కనుసన్నల్లోనే నడవాలన్న సందేశాన్ని హైకమాండ్‌కు సూటిగా స్పష్టం చేసి ఒప్పించడంలో రేవంత్ వంద శాతం సక్సెస్ అయ్యారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సెప్టెంబరు 3 నాటికి పార్టీ అగ్రనేతలతో కీలక చర్చలు పూర్తి చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో పాటు రాహుల్ గాంధీలతో జరిగిన వరుస భేటీలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు వేదికయ్యాయి. గురువారం సాయంత్రం ఇందిరా భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రేవంత్ లేవనెత్తిన అంశాలకు హైకమాండ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వాన్ని, పార్టీని పూర్తి పట్టుతో ముందుకు తీసుకెళ్లాలంటే కఠిన క్రమశిక్షణ తప్పనిసరి అని రేవంత్ గట్టిగా వాదించారు. టీమ్ లీడర్‌గా ఉన్న తన నాయకత్వాన్ని బలహీనపరిచే శక్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే పాలనపై తీవ్ర ప్రభావం పడుతుందని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. గత కొద్దికాలంగా రాష్ట్రంలో పార్టీ పట్టు సడలుతోందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, నాయకత్వాన్ని సంపూర్ణంగా బలోపేతం చేయడమే ఏకైక మార్గమని అధిష్టానం సైతం ఏకీభవించింది.
ఇవి కూడా చదవండి
పార్టీలోని అంతర్గత శత్రువులు, ప్రభుత్వంపై నిరంతరం అసంతృప్తి వెళ్లగక్కుతున్న నాయకుల తీరుపై రేవంత్ ఆధారాలతో సహా అధిష్టానం ముందుంచారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ గత ఏడాది కాలంగా ప్రభుత్వానికి, పార్టీ సమన్వయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును వివరించి, ఆమె ఉద్వాసనకు లైన్ క్లియర్ చేసుకున్నారు. కొండా సురేఖను బుధవారమే రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించిందని, గురువారం మధ్యాహ్నానికి రాజీనామా రాకపోతే ఆమెను నేరుగా బర్తరఫ్ చేయాలన్న సూచన కూడా ఢిల్లీ పెద్దల నుంచి వచ్చినట్లు స్పష్టమైంది. సురేఖ ఉద్వాసనతో పాటు పలు కీలక నియామకాలకు హైకమాండ్ ఆమోదముద్ర వేసింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదనే హెచ్చరికను ఈ నిర్ణయాల ద్వారా అసంతృప్తి వర్గానికి పంపారు.
రేవంత్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో పార్టీ యంత్రాంగంలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షీ నటరాజన్ స్థానంలో సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ వంటి సమర్థుడైన నాయకుడిని నియమించే దిశగా చర్చలు జరిగాయి. ప్రభుత్వ విధానాలకు పూర్తి అండగా నిలిచేలా ఇన్ఛార్జ్ నియామకం ఉండాలని రేవంత్ చేసిన విజ్ఞప్తిని అధిష్టానం పరిశీలించింది. కాగా, కేబినెట్ సమగ్ర పునర్వ్యవస్థీకరణ అంశాన్ని త్వరలో జరగనున్న అసెంబ్లీ భేటీల అనంతరం చర్చించాలని నిర్ణయించారు.
మొత్తంగా చూస్తే.. ఢిల్లీ పర్యటన ద్వారా రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద తనకున్న తిరుగులేని రాజకీయ పరపతిని చాటుకున్నారు. తనను కాదని తెలంగాణలో పార్టీని నడపడం సాధ్యం కాదనే సంకేతాన్ని పార్టీ పెద్దల చేతనే చెప్పించి, రాష్ట్ర కాంగ్రెస్‌లో వన్ అండ్ ఓన్లీ లీడర్ తానేనని అధిష్టానం సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు.








