బొండా ఫ్యామిలీకి ప్లస్, వంగవీటి రాధకు మైనస్ అవేనా..?
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బెజవాడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల్లో గట్టి పోటీ నెలకొంది. ఈ రేసులో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు బొండా సిద్ధార్థ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, మరోవైపు వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే, ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం బొండా సిద్ధార్థ్‌కు భారీగా ప్లస్ పాయింట్లు కనిపిస్తుండగా, వంగవీటి రాధాకృష్ణకు కొన్ని కీలక అంశాలు మైనస్‌గా మారుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
బొండా సిద్ధార్థ్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆయన పార్టీ మారకపోవడం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, బొండా కుటుంబం ఎక్కడా వెనకడుగు వేయలేదు. వైసీపీ నుంచి ఎన్నో ప్రలోభాలు, ఒత్తిడులు వచ్చినప్పటికీ టీడీపీని వీడకుండా పార్టీ లైన్లోనే నడిచారని సిద్ధార్థ్ వర్గం బలంగా చెబుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ బెజవాడ క్యాడర్‌కు అండగా ఉంటూ, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సాధారణ ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. ఈ విధేయత, అంకితభావమే ఇప్పుడు ఆయనకు అధిష్ఠానం వద్ద, చంద్రబాబు నాయుడి వద్ద పెద్ద ప్లస్ పాయింట్‌గా మారిందని ఆయన వర్గం ధీమాగా ఉంది.
ఇవి కూడా చదవండి
ఇక వంగవీటి రాధాకృష్ణ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత, స్థానిక కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా నాలుగు, ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం మినహా, బెజవాడ నగరంలో క్షేత్రస్థాయి క్యాడర్‌తో నిరంతర సంబంధాలు దెబ్బతిన్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే రాజకీయంగా టీడీపీకి బద్ధ శత్రువులుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలతో వంగవీటి రాధాకృష్ణకు ఉన్న వ్యక్తిగత సన్నిహిత సంబంధాలు కూడా ఆయనకు పెద్ద మైనస్‌గా మారాయి. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన తమ్ముళ్లు ఈ స్నేహ బంధాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమీకరణాలు కూటమి ప్రభుత్వ పెద్దల వద్ద రాధాకృష్ణ గ్రాఫ్‌ను తగ్గించేలా చేస్తున్నాయని టాక్.
ఈ నేపథ్యంలో, విద్యావంతుడు, యువ నాయకుడు కావడంతో పాటు పార్టీ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్న బొండా సిద్ధార్థ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బెజవాడ తమ్ముళ్లు గట్టిగా నమ్ముతున్నారు. అటు జెన్ జీని కూడా ఆకట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో.. బొండా ఫ్యామిలీకి సామాజిక వర్గం, వయసు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అటు అంగ, అర్ధ బలం ఉండటం బొండా ఫ్యామిలీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.








