ఆరోగ్య కారణాలా.. వ్యూహాత్మక నిర్ణయమా? పవన్ గైర్హాజరుపై ఆసక్తికర చర్చ..
కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తరచూ కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా గురువారం జరిగిన మంత్రివర్గ భేటీకి కూడా ఆయన హాజరు కాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళ (Kerala)లో ప్రకృతి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఈ గైర్హాజరుకు ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలేనని తెలుస్తోంది. అయితే గతంలో కూడా కొన్ని సమావేశాలకు ఆయన రాకపోవడం, మరికొన్ని సందర్భాల్లో సమావేశానికి హాజరై అనారోగ్య కారణాలతో మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది.
టీడీపీ (TDP)-జనసేన (Jana Sena)-బీజేపీ (BJP) కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు సుమారు 50 వరకు కేబినెట్ సమావేశాలు జరిగాయని, వాటిలో పవన్ కొన్ని సమావేశాలకు గైర్హాజరయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 3 వరకు దాదాపు 15 మంత్రివర్గ సమావేశాలు జరిగితే, వాటిలో చాలా తక్కువ సమావేశాలకే ఆయన హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. సుమారు 11 భేటీలకు ఆయన దూరంగా ఉన్నారని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సంఖ్యకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్‌కు ఇటీవల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండటం కూడా ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తోంది. కొంతకాలం క్రితం ముంబై (Mumbai)లోని ఆసుపత్రిలో ఆయన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా నొప్పి పూర్తిగా తగ్గకపోవడంతో విశ్రాంతి, చికిత్స కోసం కేరళకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని సహజంగానే చూడాలని కూటమి వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
అయితే రాజకీయంగా మాత్రం ఈ అంశంపై భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. పవన్ గైర్హాజరు పూర్తిగా ఆరోగ్య కారణాల వల్లేనా? లేక ఇందులో రాజకీయ కోణం కూడా ఉందా? అనే సందేహాలను కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులకు కూడా పవన్ గతంలో క్రమం తప్పకుండా హాజరయ్యేవారని, ఇటీవల మాత్రం ఆయన పాల్గొనడం తగ్గిందని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది.
ఒక కేబినెట్లో కీలకమైన శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి వరుసగా సమావేశాలకు దూరంగా ఉండటం సాధారణ విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కేవలం మంత్రి మాత్రమే కాకుండా ఒక రాజకీయ పార్టీకి అధినేత కావడంతో ఆయన గైర్హాజరుపై సహజంగానే ఎక్కువ దృష్టి పడుతోంది. అయితే ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కూటమి నాయకత్వం దీనిని సానుకూలంగానే చూస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి సెప్టెంబర్ 10న కేరళ నుంచి తిరిగి వస్తారని సమాచారం. ఈ నెలలోనే మరో కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన అందులో పాల్గొంటారా లేదా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఆయన తిరిగి చురుకుగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటే ఈ గైర్హాజరుపై కొనసాగుతున్న రాజకీయ చర్చలకు కూడా కొంతవరకు తెరపడే అవకాశం ఉంది.








