అడోబ్ నాయకుడిగా మళ్లీ భారతీయుడే..!
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అడోబ్ నాయకత్వ పగ్గాలు మళ్లీ భారతీయుడికే దక్కాయి. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న శంతను నారాయణ్ ఆ పదవి నుంచి వైదొలుగుతుండడంతో .. ఆయన స్థానంలో కంపెనీ నూతన సీఈఓ (Adobe new CEO)గా అనిల్ చక్రవర్తి (Anil Chakravarthy) నియమితులయ్యారు. డిసెంబర్ 1న అనిల్ ఈ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుతం మార్కెట్లో ఏఐ ప్రభావం నేపథ్యంలో డిజైన్ క్రియేటివ్ సాఫ్ట్‌వేర్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అడోబ్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థలో నాయకత్వ మార్పు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సీఈఓగా కొనసాగుతోన్న శంతను నారాయణ్ (Shantanu Narayen) ఈ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు మార్చిలో కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈయన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఏఐ (AI) యుగంలో అడోబ్ వృద్ధికి నాయకత్వం వహించడానికి అనిల్ సరైన వ్యక్తి అని నమ్ముతున్నానని శంతను నారాయణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారత్‌కు చెందిన అనిల్ చక్రవర్తి ఐఐటీ వారణాసి నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్, పీహెచ్డీ పట్టాలు పొందారు. 2020లో ఆయన అడోబ్‌లో చేరారు. కొన్నేళ్లపాటు డిజిటల్ ఎక్స్పీరియన్స్ వ్యాపారానికి నాయకత్వం వహించారు. అనంతరం కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత చేపట్టారు. అదే సమయంలో సంస్థ గ్లోబల్ సేల్స్‌ను కూడా పర్యవేక్షించారు. అడోబ్‌లో చేరడానికి ముందు అనిల్ చక్రవర్తి క్లౌడ్ డేటా-మేనేజ్మెంట్ కంపెనీ ఇన్ఫర్మేటికాలో నాలుగేళ్ల పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.








