భారీగా పుంజుకున్న రూపాయి: ఫారెక్స్ మార్కెట్లో కొత్త ఉత్సాహం
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో (ఫారెక్స్) భారత రూపాయి (Rupee Value) బలంగా పుంజుకుంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఏకంగా 47 పైసలు పెరిగి 94.26 స్థాయికి చేరుకుంది.
కొనుగోళ్ల మద్దతుతో లాభాల జోరు
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఆరంభంలో 94.30 వద్ద ప్రారంభమైన రూపాయి, కొనుగోళ్ల మద్దతుతో మరింత బలపడి 94.26 వద్దకు చేరి లాభాల్లో ట్రేడవుతోంది. అంతకుముందు బుధవారం ముగింపు సమయానికి సైతం రూపాయి (Rupee Value) విలువ 22 పైసలు లాభపడి 94.73 వద్ద స్థిరపడగా, తాజా సెషన్లోనూ అదే సానుకూల జోరును కొనసాగించి భారీ పురోగతి సాధించింది.
ఇవి కూడా చదవండి
రూపాయికి కలిసొచ్చిన అంశాలివే:
విదేశీ నిధుల ప్రవాహం: దేశంలో విదేశీ మారక ద్రవ్య లిక్విడిటీని (Forex Liquidity) పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఎఫ్సీఎన్ఆర్(బి) – FCNR(B) డిపాజిట్ల ద్వారా రికార్డు స్థాయిలో భారీగా విదేశీ నిధులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరడమే రూపాయికి (Rupee Value) ప్రధాన ఊతంగా నిలిచిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆర్బీఐ జోక్యం & ఎఫ్ఐఐల కొనుగోళ్లు: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ ఒత్తిడి వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ.. కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ సమర్థవంతమైన జోక్యం, దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) బలమైన కొనుగోళ్లు కరెన్సీకి (Rupee Value) కొత్త ఉత్సాహాన్ని అందించాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.








