కిమ్ చేతిలో కాంగ్ కోన్.. ఉత్తరకొరియా అమ్ములపొదిలో మరో డిస్ట్రాయర్..!
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. తన దేశ రక్షణ వ్యవస్థను మరింత ఆధునికీకరించేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా వరుసగా డిస్ట్రాయర్ నౌకలను .. నావీలో ప్రవేశపెడుతున్నారు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యంతో నిర్మించిన ‘కాంగ్ కోన్’ అనే కొత్త డిస్ట్రాయర్ (విధ్వంసక నౌక)ను జాతికి అంకితం చేశారు కిమ్. దేశ తూర్పు తీరంలోని ఓడరేవు నగరం వోన్సాన్లో జరిగిన ఈ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా హాజరయ్యారు.
5,000 టన్నుల బరువున్న ఈ కొత్త డిస్ట్రాయర్ కేవలం రక్షణ కోసమే కాదని, ఇది శత్రువులపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న నౌక అని స్పష్టం చేశారు కిమ్. “ఈ నౌక దేశ అణు ప్రతిచర్య వ్యవస్థలో ఒక భాగం. శత్రువుల నుంచి ముప్పు ఎదురైతే వారికి చావుదెబ్బ రుచిచూపించేలా ఇది ప్రతిదాడి చేస్తుంది” అని కిమ్ హెచ్చరించారు. దేశ నావికాదళాన్ని పూర్తిగా “అణు సాయుధ శక్తి”గా మార్చడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
నావికాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక ముఖ్యమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని, దాని ఫలితాన్ని ఎనిమిది నెలల్లో ప్రపంచానికి చూపిస్తానని కిమ్ ప్రకటించారు. ఇది 2021లో ఉత్తర కొరియా ప్రకటించిన అణు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించినది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నూతన ‘కాంగ్ కోన్’ నౌకను ఉత్తర కొరియా నావికాదళంలోని ఈస్ట్ సీ ఫ్లీట్‌లో మోహరించనున్నట్లు అధికారిక మీడియా కేసీఎన్ఏ తెలిపింది.
మూడు నెలల క్రితమే ‘చోయ్ హ్యోన్’ అనే ఇదే తరహా డిస్ట్రాయర్‌ను పశ్చిమ సముద్రంలో మోహరించిన ఉత్తర కొరియా, ఇప్పుడు ‘కాంగ్ కోన్’ను తూర్పు సముద్రంలోకి దించడం ద్వారా తన రెండు తీరాల్లో అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఈ కార్యక్రమానికి కిమ్ తన భార్య రి సోల్ జు, కుమార్తె జు ఏతో కలిసి హాజరయ్యారు.
అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ‘ఫ్రీడమ్ ఎడ్జ్’ పేరుతో సైనిక విన్యాసాలు ప్రారంభించిన రోజే ఉత్తర కొరియా ఈ నౌకను ప్రారంభించడం గమనార్హం. ఈ విన్యాసాలు యుద్ధ సన్నాహక చర్యలేనని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. సెప్టెంబర్ 9న ఉత్తర కొరియా 78వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.








