హర్మూజ్ దగ్గర నిషేధిత జోన్.. ప్రపంచదేశాల నౌకలకు ఇరాన్ హెచ్చరికలు..!
హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం ఎవరిది..? ఇప్పుడిదే అంశం అటు అమెరికాను.. ఇటు ఇరాన్ ను వేధిస్తోంది. తమదే అధికారమని ఇరాన్ చెబుతుంటే.. కాదు.. మాఆధీనంలో ఉందని అమెరికా ప్రకటిస్తోంది. ఈ క్రమంలో టెహ్రాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్‌లో తాము సూచించిన మార్గంలో కాకుండా వేరే రూట్లో వెళ్లడానికి యత్నిస్తున్న నౌకలను అడ్డుకునేందుకు.. జలసంధి వెలుపల ఓ నిషేధిత ప్రాంతాన్ని (Exclusion Zone) ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇరాన్ జాతీయ భద్రతా అధిపతి మొహసెన్ రెజాయ్ వెల్లడించారు. రాబోయే వారం రోజుల్లో ఆ ప్రాంతాన్ని ప్రకటిస్తామన్నారు. అది అమెరికా నౌకా దిగ్బంధన రేఖ నుంచి ప్రారంభమై.. హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్ వరకు కొనసాగుతుందన్నారు.
తాము నిషేధించిన ప్రాంతం మీదుగా వెళ్లే ఏ నౌక అయినా తమ ఆంక్షల జాబితాలో చేరుతుందని రెజాయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి అమెరికా (USA) నియంత్రణలో ఉందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. తమ చమురు ట్యాంకర్లను అగ్రరాజ్యం లక్ష్యం చేసుకుంటున్నా.. చమురు ఉత్పత్తి, రవాణా యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతిరోజూ 10-15 లక్షల బ్యారెళ్ల చమురును విక్రయిస్తున్నట్లు తెలిపారు. టెహ్రాన్ నుంచి చమురు ఎగుమతులను నిరోధించే లక్ష్యంతో అమెరికా కొన్ని నెలల క్రితం ఇరాన్ (Iran) ఓడరేవులపై నావికా దిగ్బంధనాన్ని విధించింది. దీనిని పర్యవేక్షించడానికి 20కి పైగా యుద్ధనౌకలను హర్మూజ్ వద్ద మోహరించింది. ఈ క్రమంలోనే టెహ్రాన్ తాజాగా నిషేధిత జోన్ ఏర్పాటును ప్రకటించడం చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మళ్లీ ఉద్ధృతమవుతున్నాయి. శనివారం హర్మూజ్‌లో ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై అగ్రరాజ్య సైన్యం దాడులు చేసింది. దీంతో ఇరాన్ కూడా.. ఆదివారం అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యం చేసుకుంది.








