సౌదీతో అమెరికా భారీ డీల్.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్..!
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలు సైతం తమ భద్రతపై ఫోకస్ పెంచాయి. వివిద దేశాలు తమ భద్రత కోసం.. పలురకాల ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా అమెరికా సైతం.. ఆయా దేశాలకు ఆయుద సరఫరా ఒప్పందాలు చేసుకుంటోంది.గల్ఫ్ దేశాలపై తన పట్టును మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోన్న అగ్రరాజ్యం.. సౌదీ అరేబియాతో కీలక డీల్‌కు సిద్ధమైంది. ఆ దేశానికి (Saudi Arabia)కు 5 బిలియన్ డాలర్ల (రూ.47వేల కోట్లు) విలువైన ఆయుధాలు ఇచ్చేందుకు అగ్రరాజ్యం ఆమోదించింది. ప్రాంతీయ ముప్పుల నుంచి సౌదీ తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో.. బాంబులు, గైడెన్స్ కిట్లు ఇతర ఆయుధాల విక్రయానికి ట్రంప్ యంత్రాంగం (US) ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా 5,004 జాయింట్ డైరెక్ట్ ఎటాక్ మ్యూనిషన్ (JDAM) గైడెన్స్ కిట్లు, 5,000 KMU-556 JDAM గైడెన్స్ కిట్లు, 500 పౌండ్ల బరువుండే 5,004 బాంబులు.. 2వేల పౌండ్ల బరువైన 5,000 బాంబులను సరఫరా చేయనున్నట్లు యూఎస్ విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ ప్యాకేజీలో ఫ్యూజ్ వ్యవస్థలు, టార్గెట్ డిటెక్టర్లు, కంటైనర్లు, సహాయక పరికరాలు, ఆయుధాల విడి భాగాలతో పాటు, యూఎస్ కాంట్రాక్టర్ల నుంచి సాంకేతిక సహాయం కూడా అందుతుంది. సౌదీ, ఇతర గల్ఫ్ దేశాలు.. యూఎస్ దళాల మధ్య ఉన్న పరస్పర సహకారం ఇకపై మరింత మెరుగవుతుందని అమెరికా ఈ సందర్భంగా తెలిపింది.
ఇరాన్‌పై అమెరికా దాడులకు ప్రతీకారంగా.. గల్ఫ్ దేశాలలోని యూఎస్ స్థావరాలు, సైనిక శిబిరాలను టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం సౌదీకి భారీగా ఆయుధాలు సరఫరా చేస్తుండడం (Saudi-US Deal) ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ అరబ్ దేశంతో 30 ఏళ్ల భాగస్వామ్యానికి అమెరికా అణు ఒప్పందం (Nuclear Deal) కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, అణు ఇంధన సరఫరా, రియాక్టర్ల సాంకేతికత బదిలీ, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు శిక్షణ, రేడియోధార్మిక పదార్థాల నిర్వహణ, అంతర్జాతీయ తనిఖీలు వంటి వాటిల్లో సౌదీకి అగ్రరాజ్యం సహకరించనుంది.








