అమెరికా సైన్యంలో కట్టప్పలెవరు…? సొంత సైనికులకు ట్రంప్ లైడిటెక్టర్ పరీక్షలు..!
ఇరాన్ తో యుద్ధం సుదీర్ఘంగా సాగుతోంది. వందల బాంబులు కుమ్మరించినా… వేలాదిగా మిస్సైల్స్ ప్రయోగించినా.. టెహ్రాన్ దిగిరావడం లేదు. దీంతో తమ సొమ్మంతా యుద్ధరంగంలో కుమ్మరిస్తున్నారంటూ ట్రంప్.. అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ నకు..మరో కొత్త సమస్య ఎదురైంది. అదే సైన్యంలో కట్టప్పలు. వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు ట్రంప్.
యుద్ధానికి సంబంధించిన కీలక విషయాలు, ఆయుధ నిల్వల వంటి సున్నితమైన సమాచారం (Iran War Secrets) మీడియాకు లీక్ అవుతోంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ట్రంప్ (Donald Trump) యంత్రాంగం.. లీక్ చేసేది ఎవరో తెలుసుకునేందుకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ సహా పలువురు సీనియర్ సైనికాధికారులకు నిజ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు సమాచారం.
యూఎస్ మిలిటరీ జాయింట్ స్టాఫ్ విభాగానికి చెందిన దాదాపు 50 మంది అధికారులు, సిబ్బందికి గత నెల పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో దాదాపు 1,500 నుంచి 2వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో మిలిటరీ అధికారులతో పాటు పౌర సేవల సిబ్బంది నిజ నిర్ధరణ పరీక్షకు హాజరైనట్లు సమాచారం. అమెరికా ఆయుధ నిల్వలు, క్షిపణుల సంఖ్యతో పాటు ఇరాన్ (Iran)పై దాడులకు సంబంధించిన సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారా? అని వీరిని ప్రశ్నించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలపై పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందించారు. ‘‘అంతర్గత సిబ్బందిపై చర్యలు, దర్యాప్తునకు సంబంధించిన విషయాలపై మేం మాట్లాడలేం. అయితే, జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీకయినట్లు తేలితే మాత్రం దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. తదనుగుణంగా చర్యలు చేపడతాం. సైన్యానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని భద్రంగా ఉంచడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మోహరించిన సైనికుల రక్షణకు సంబంధించిన అంశం ఇది’’ అని పెంటగాన్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ సహా కొందరు సీనియర్ మిలిటరీ అధికారులకు ఈ పరీక్షలు నిర్వహించలేదని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తరిగిపోతున్నట్లు కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. రక్షణ రంగంలో పనిచేసే అత్యంత కొద్ది మంది సీనియర్లకు మాత్రమే తెలిసే ఈ సమాచారం బయటకు పొక్కడంతో ట్రంప్ సర్కారు దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.
సైనిక సిబ్బంది ఉపయోగించే ఫోన్లు, కంప్యూటర్లలోని యాడ్ ట్రాకర్లను యూఎస్ మిలిటరీ డిసేబుల్ చేసింది. ఈ ట్రాకర్ల సాయంతో బలగాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, వారిని టార్గెట్ చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది. ఆర్మీతో పాటు ఎయిర్‌ఫోర్స్, అమెరికా ప్రత్యేక ఆపరేషన్ల కమాండ్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది డివైజ్‌ల్లో ఈ ట్రాకర్‌ను బ్లాక్ చేసినట్లు సమాచారం.








