కొండా కుర్చీపై ‘రాములమ్మ’ కన్ను!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా పార్టీని కుదిపేసిన అంతర్గత విభేదాలు, వివాదాలకు అధిష్టానం కఠిన నిర్ణయాలతో చెక్ పెట్టింది. దీంతో.. ఇప్పుడు అందరి దృష్టీ రేవంత్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనే పడింది. కొండా సురేఖ స్థానంలో కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై గాంధీభవన్‌తో పాటు ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో తీవ్రస్థాయి కసరత్తు మొదలైంది. కొండా సురేఖ ఖాళీ చేసిన ఫైర్‌బ్రాండ్ స్థానాన్ని అంతే ధీటుగా భర్తీ చేయగల ఏకైక నేతగా మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతి పేరు తెరపైకి రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
రాష్ట్రంలో బలమైన బీసీ మహిళా గొంతుకగా ఉన్న కొండా సురేఖ స్థానాన్ని భర్తీ చేయాలంటే సమానమైన ఇమేజ్, వాగ్ధాటి ఉన్న మహిళా నేతనే ఎంపిక చేయాలని ఏఐసీసీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఈ సమీకరణాల్లో విజయశాంతి పేరు రాజకీయంగా కాంగ్రెస్‌కు అత్యంత లాభదాయకమైన అస్త్రంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడే నైజం, వెనకడుగు వేయని నైపథ్యం ఆమె సొంతం. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను గట్టిగా ఇరుకున పెట్టాలంటే ‘రాములమ్మ’కు మించిన చాయిస్ లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. గతంలో కేసీఆర్ సారథ్యంలోని పార్టీలో ఎంపీగా పనిచేసి, గులాబీ దళ అంతర్గత వ్యూహాలు, బలహీనతలపై పూర్తి పట్టున్న నేత కావడంతో ఆమె చేరికతో ప్రతిపక్ష దాడిని తిప్పికొట్టడం ప్రభుత్వానికి సులువవుతుందనేది వ్యూహం.
ఎన్నికల అనంతరం పార్టీలో ఎమ్మెల్సీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విజయశాంతి ఎక్కడా అసంతృప్తి వెళ్లగక్కకుండా, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ అధిష్టానం సూచనలకు కట్టుబడి ఉన్నారు. వివాదరహితురాలిగా ఉంటూనే పార్టీకి అవసరమైన సమయాల్లో మాత్రమే మీడియా ముందుకొచ్చి తనదైన శైలిలో గళం విప్పారు. ఈ నిబద్ధతే ఇప్పుడు ఆమెకు ప్రధాన బలమైంది. మంత్రివర్గ విస్తరణ సంకేతాలు రాగానే ఆమె ఢిల్లీకి బయలుదేరడం వెనుక కీలక రాజకీయ ప్రణాళిక ఉన్నట్లు సమాచారం. అధిష్టానంలోని అగ్రనేతలతో ఆమెకున్న పాత పరిచయాలు, క్లీన్ ఇమేజ్ ఆమెకు కలిసివచ్చే అంశాలు. అయితే కేవలం నామమాత్రపు శాఖ కాకుండా, అత్యంత కీలకమైన హోం శాఖ లేదా ప్రాధాన్యత ఉన్న పోర్ట్‌ఫోలియో ఇస్తేనే బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కేవలం ఒక్క స్థానానికే పరిమితం కాకుండా, రేవంత్ కేబినెట్లో ఇద్దరు లేదా ముగ్గురు కొత్తవారికి అవకాశం కల్పిస్తూ సమగ్రమైన ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. విజయశాంతితో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే దిశగా సమాలోచనలు సాగుతున్నాయి. తద్వారా సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతూకం దెబ్బతినకుండా జాగ్రత్తపడాలని అధిష్టానం చూస్తోంది. పనితీరు ఆధారంగా పలువురు సీనియర్ల శాఖల్లో కోత విధించడం లేదా మార్పులు చేయడం కూడా ఈ పునర్వ్యవస్థీకరణలో భాగం కానుంది.
ఏది ఏమైనా, కొండా సురేఖ నిష్క్రమణతో ఏర్పడే రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మార్చుకుని, మళ్లీ అధికార కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్న విజయశాంతి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కేబినెట్లో లేడీ అమితాబ్ ఎంట్రీ ఖాయమైతే మాత్రం తెలంగాణ శాసనసభ లోపలా, బయటా రాజకీయ సమరం మరింత రసవత్తరంగా మారడం ఖాయం.








