పవన్ సాదినేని అరెస్ట్ కేసులో ట్విస్ట్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు
సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో డైరెక్టర్ పవన్ సాదినేని(pavan sadineni)కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి తనను మోసం చేశారని, లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో పాటు శారీరకంగా దాడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి పవన్ సాదినేనిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోరులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
బాధితురాలు పవన్‌తో సంవత్సరానికి పైగా రిలేషన్ లో ఉన్నానని, ఈ టైమ్ లో పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించారని ఆరోపించింది. తన సినీ కెరీర్‌కు సహకరిస్తానని, మంచి అవకాశాలు ఇప్పిస్తానని కూడా హామీలు ఇచ్చారని ఆమె పేర్కొంది. అయితే తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మోసం చేశారని ఫిర్యాదులో వివరించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా పవన్ సాదినేని ప్రస్తుతం దుల్కర్ సల్మాన్(Dulquer salman) హీరోగా తెరకెక్కుతున్న ఆకాశంలో ఒక తార(aakasam lo oka tara) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్(prema ishq kadal), సావిత్రి(Savitri), సేనాపతి(Senapati) వంటి సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా బెయిల్ లభించినప్పటికీ కేసు విచారణ మాత్రం కొనసాగనుంది. బాధితురాలు చేసిన ఆరోపణలపై తుది నిజానిజాలు న్యాయస్థానంలో విచారణ అనంతరం తేలనున్నాయి.








