ఎలన్ మస్క్ ఇంత ప్రమాదకరమైనవాడా? డాక్యుమెంటరీలో ఏముంది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవటానికి నియంతలు తమ సైన్యాన్ని , ఆయుధాలను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు నియంత అర్దం మారిపోతోంది. నియంతగా మారాలంటే టెక్నాలిజీని మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి. అంత శక్తి ఈ కాలంలో ఎవరి దగ్గర ఉంది.అంటే టక్కున గుర్తుచ్చే పేరు ఎలన్ మస్క్.ఎందుకంటే ఎలన్ మస్క్ దగ్గర లేనిది లేదు. ముఖ్యంగా టెక్నాలిజీ పరంగా ఆయన ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.
దాంతో మస్క్ తన శక్తితో భవిష్యత్తులో ఏమి అవ్వాలనుకుంటున్నారు అనేది ఎవరికీ తెలికపోయినా ఖచ్చితంగా తమకు ప్రమాదంగా మారతాయని ప్రభుత్వాలు భావిస్తోంది. మీడియా మొత్తుకుంటోంది. ఇదిగో ఇప్పుడు ఏకంగా ఓ డాక్యుమెంటరీ ఆయన పవర్ ని విశ్లేషిస్తూ..పవర్ ఒకరి చేతిలో కేంద్రీకృతమైపోతే ఏం జరుగుతుందో చెప్తూ ముందుకు వస్తోంది.
అయితే ఎవరో కౌన్ గిస్కా గొట్టం ఈ డాక్యుమెంటరీ తీస్తే మస్క్ కు ఏమీ నష్టం లేదు..లాభమూ లేదు కానీ డాక్యుమెంటరీ తీసింది ఆస్కార్ విజేత డాక్యుమెంటరీ దర్శకుడు అలెక్స్ గిబ్నీ. ఆ భారీ డాక్యుమెంటరీ పేరు Musk. ఏముంది అందులో.ఏం చెప్పబోతున్నారు..ఇందుకింత డిస్కషన్.
ఎందుకంటే మస్క్ దగ్గర కేవలం డబ్బు మాత్రమే ఉంటే అసలు విషయమే కాదు. కానీ ఆన దగ్గర రాకెట్లు ఉన్నాయి. వేలాది శాటిలైట్లతో కూడిన ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చర్చించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉంది. కృత్రిమ మేధస్సు రంగంలో కంపెనీ ఉంది. అమెరికా అంతరిక్ష కార్యక్రమాలకు కీలకమైన సంస్థ ఉంది. ఇవన్నీ ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయన్ని చూసే కోణం మారిపోతుంది. అదే ఈ డాక్యుమెంటరీలో చేసామంటున్నారు. ఎలాన్ మస్క్ మంచివాడా? చెడ్డవాడా? అనేది కాదు డిస్కషన్. ఒక్క వ్యక్తి చేతిలో ఇంత పవర్ ఉండటం సురక్షితమేనా? కాదా అనేది అసలు విషయం.
ఈ డాక్యుమెంటరిలో మస్క్‌ను కేవలం ఒక వివాదాస్పద బిలియనీర్‌గా చూపించడం లేదు. ఎలాన్ మస్క్ ప్రమాదకరమైన వ్యక్తా? లేక ఆయన చేతిలో కేంద్రీకృతమవుతున్న పవర్ ఏ మేరకు ప్రమాదం అని.
అయినా ఎలాన్ మస్క్‌పై విమర్శలు ఈ రోజు కొత్తగా మొదలైనవి కాదు. Teslaపై విమర్శలు వచ్చాయి. Xను కొనుగోలు చేసిన తర్వాత విమర్శలు వచ్చాయి. Starlink నిర్ణయాలపై ప్రశ్నలు వచ్చాయి. రాజకీయాల్లో ఆయన పాత్రపై చర్చ జరిగింది.
అయితే గిబ్నీ డాక్యుమెంటరీ ఈ అన్ని విషయాలను విడివిడిగా చూడదు. వాటిని ఒకచోట కలిపి చూస్తుంది. అప్పుడు ఏమి కనిపిస్తుంది. మస్క్ కు చెందిన ఒక కంపెనీ కార్లు తయారు చేస్తోంది. మరో కంపెనీ రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతోంది. అదే వ్యవస్థ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు అత్యంత కీలకమైన ఇంటర్నెట్ను అందిస్తోంది. మరో కంపెనీ ప్రపంచ రాజకీయ చర్చలకు వేదికగా మారిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను నడుపుతోంది. ఇంకో వైపు AI రంగంలో అడుగులు వేస్తోంది.
అసలు కంటెంట్ ఇదే
అంటే ఇది కేవలం ఒక బిజినెస్ సామ్రాజ్య విస్తకరణం క్రింద చూడాలా? లేక భవిష్యత్తు ప్రపంచానికి అవసరమైన కీలక వ్యవస్థలు క్రమంగా ఒక వ్యక్తి ప్రభావ పరిధిలోకి వస్తున్నాయి అని ఆలోచించాలా? ఇదే డాక్యుమెంటరీ లో మెయిన్ మేటర్.
ఒక వ్యక్తి ‘స్విచ్ ఆఫ్’ చేయగలిగే పవర్?
ఇక్కడ అన్నిటికన్నా ప్రధానమైన అంశం Starlink. గతంలో యుద్ధం జరిగితే కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రభుత్వాలు, సైన్యాల చేతిలో ఉండేవి. అయితే ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ వంటి కీలక సాంకేతిక వ్యవస్థలు ప్రైవేట్ కంపెనీల చేతిలో కూడా ఉన్నాయి. ఆ కంపెనీ నిర్ణయాలు ఒక దేశానికి, ఒక యుద్ధానికి, ఒక ప్రాంతానికి ఏ మరకు ప్రభావం చూపగలవు? ఇక్కడే మస్క్ పవర్‌పై అసలు చర్చ మొదలవుతుంది.
ఎందుకంటే ఒకప్పుడు బిలియనీర్ అంటే డబ్బున్న వ్యక్తి. ఇప్పుడు కొందరు బిలియనీర్ల దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ కూడా ఉంది. రోడ్లు ప్రభుత్వాలవి కావచ్చు. కానీ డిజిటల్ ప్రపంచంలోని కొన్ని కీలక రహదారులు ప్రైవేట్ కంపెనీలవి. అలాంటి అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో మస్క్ ఒకరు.
ఇవన్నీ గిబ్నీ డాక్యుమెంటరీలో చోటు చేసుకుంటాయి. అలాగే Starlinkను కేవలం ఇంటర్నెట్ కంపెనీగా కాకుండా, ఎన్నికల్లో గెలవని ఒక వ్యక్తికి అంతర్జాతీయ వ్యవహారాల్లో అసాధారణమైన ప్రభావాన్ని ఇచ్చే వ్యవస్థగా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు.
మస్క్ దగ్గర ‘డేటా పవర్’ కూడా ఉందా?
డాక్యుమెంటరీలో అత్యంత వివాదాస్పదంగా మారే అంశం ఇదే. మస్క్ అమెరికా ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొన్న సమయంలో DOGE బృందానికి ఫెడరల్ ఐటీ వ్యవస్థలపై విస్తృతమైన యాక్సెస్ ఉండేదనే ఆరోపణలు, ప్రశ్నలను గిబ్నీ పరిశీలిస్తున్నారు.ఇలాంటి భారీ డేటా ఓ ప్రెవేట్ వ్యక్తికి చెందిన AI చేతికి వెళితే? దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తే? అప్పుడు పరిస్ధితి ఎలా ఉంటాయి.
ఎన్నికల ముందే మస్క్‌కు ఎలా తెలుసు?
డాక్యుమెంటరీలో అత్యంత సంచలనాత్మకంగా కనిపించే మరో ఎపిసోడ్ 2024 అమెరికా ఎన్నికలకు సంబంధించినది. మస్క్ మాజీ భాగస్వామి Ashley St. Clair డాక్యుమెంటరీలో ఒక ఇంట్రస్టింగ్ విషయం చెబుతారు. ఎన్నికల ఫలితాలు రాకముందే మస్క్‌కు అసాధారణమైన ధీమా కనిపించిందని ఆమె పేర్కొంది. అంతేకాదు, ఆయన “ten thousand lasers in space” అని చెప్పినట్లు ఆమె గుర్తు చేసుకుంది. దీనికి అర్థం ఏమిటి?
మస్క్ ఈ డాక్యుమెంటరీలో ఉన్నాడా
అలెక్స్ గిబ్నీ మస్క్‌ను ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నించాడు. అయితే దానికి మస్క్ అంగీకరించలేదు. సాధారణంగా ఒక డాక్యుమెంటరీ దర్శకుడికి ఇది పెద్ద సమస్య. కానీ ఇక్కడ దర్శకుడు ఆ సమస్యను ఒక కొత్త ప్రయోగంగా మార్చేశాడు. మస్క్ పాత ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆడియోలను సేకరించారు. వాటిని ఉపయోగించి ఒక డిజిటల్ ఎలాన్ మస్క్ ను రూపొందించారు. ఆ అవతార్ వీడియో గేమ్ పాత్రలా కనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో మస్క్ జీవితాన్ని నిజమైన ప్రపంచంలా కాకుండా వీడియో గేమ్‌లా చూపించారు.
డాక్యుమెంటరీ చివర్లో మరో ఊహించని కోణం వస్తుంది.
గిబ్నీతో మాట్లాడిన మస్క్‌కు సన్నిహితంగా పనిచేసిన ఒక వ్యక్తి, ఆయనను చూసి చెప్పిన మాట: “నేను చూసిన అత్యంత దుఃఖంలో ఉన్న వ్యక్తి ఇతడే.” అని. ఈ వ్యాఖ్యను గిబ్నీ తన కథలో ఒక కీలకమైన మానసిక ప్రశ్నగా మార్చాడు. అంత పవర్ ఉన్న వ్యక్తి సంతోషంగా లేకపోతే?
ఇంతకీ ఎలాన్ మస్క్ నిజంగానే ప్రమాదకరమైనవాడా?
ఈ ప్రశ్నకు డాక్యుమెంటరీని చూసే ముందు మనం తీర్పు చెప్పలేం. అంతేకాదు, డాక్యుమెంటరీలో వచ్చిన ప్రతి ఆరోపణ కూడా నిరూపించబడిన వాస్తవం అని చెప్పడం లేదు. అయితే ఈ సినిమా ఒక విషయం మాత్రం చాలా బలంగా చెబుతోంది. ప్రమాదం ఒక వ్యక్తిలో ఉండకపోవచ్చు. అయితే ప్రమాదం అతడి చేతిలో ఉన్న పవర్‌కు సరైన నియంత్రణలు లేకపోవడంలో ఉండవచ్చు అంటోంది.
విడుదల ఎప్పుడు
అలెక్స్ గిబ్నీ తీసిన Musk డాక్యుమెంటరీ విడుదల తేదీలు ఇలా ఉన్నాయి:
వరల్డ్ ప్రీమియర్: సెప్టెంబర్ 9, 2026 — వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో.
అమెరికా థియేట్రికల్ రిలీజ్: అక్టోబర్ 16, 2026. Bleecker Street థియేటర్లలో విడుదల చేయనుంది.
OTT/స్ట్రీమింగ్ రిలీజ్: ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.








