కాపీ కొట్టిన సినిమానే కల్ట్ క్లాసిక్ అయ్యింది! ఏముంది అందులో
—సూర్య ప్రకాష్ జోశ్యుల
కాపీకొట్టడం తప్పే కావచ్చు. కాపీ కొట్టడం అవసరమా అనొచ్చు. కాపీ అంటూ కేసులు వేయచ్చు. ఇన్ని చేసి చివరకు ఆ సినిమాని కల్ట్ క్లాసిక్ చేయటం మాత్రం అరాచకం కదా.కొన్ని సినిమాలు అంతే మొదట జనాలు చేత తిట్టించుకుంటాయి. ఇలాంటి సినిమా తీసాడేంటి అని కామెంట్స్ వస్తాయి. కాలం మారేసరికి అబ్బా అప్పట్లో భలే సినిమా వచ్చిందిరా అని టీవీల్లో, ఓటిటిల్లో చూసి మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి కల్ట్ క్లాసిక్ చేసేస్తారు. అలాంటి సినిమాలు తెలుగులో బోలెడు అంటారా. ఇప్పుడు అలాంటి ఓ హాలీవుడ్ సినిమా గురించి చెప్పబోతున్నాను. కాపీ అని తిట్టినోళ్లే అబ్బా ..కల్ట్ క్లాసిక్ అని సినిమా కాళ్లు మ్రొక్కుతున్న వింత ఘటన ఇది. ఇంతకీ ఇంతా చెప్పి ఆ సినిమా పేరు ఏంటో చెప్పలేదంటారా…ఆ సినిమా పేరు ‘హార్డ్‌వేర్’ (Hardwar).
అవును ఈ సినిమా రిలీజైనప్పుడు చూసిన చాలా మంది అబ్బే ఇదో చీప్ సైన్స్ ఫిక్షన్ సినిమారా..బీ గ్రేడ్ యవ్వారం అని ముక్కు చీదేసారు. క్రిటిక్స్ అయితే అసలు ఇది సినిమానా..ఇండస్ట్రీ ఇలా అయ్యిపోయిందేంటి అని భోరున విలపించారు. అది అక్కడతో ఆగలేదు… ఓ కాపీ కేసుని తెచ్చింది. ఈ సినిమా..తమ కథను కాపీ కొట్టి తీసారంటూ ఓ సంస్ద కోర్టు కు ఎక్కింది. అఫ్ కోర్స్ చివరకు ఆ కేసు ప్రూవ్ అయ్యింది. క్రెడిట్స్ లో కథ రాసినవాళ్ల పేరు రాయాల్సి వచ్చింది.
మామూలుగా అయితే ఇంత పెంట జరిగాక..సినిమా పోయింది, కాపీ కొట్టారు అని ప్రూవ్ అయ్యాక…అక్కడితో దాని చరిత్ర ఖతం అవుతుంది. కానీ ఇదో మొండి ఘటం.కాపీ కొట్టిందనే ఆరోపణలు, కోర్టు కేసు, విమర్శకుల నిరాసక్తత అన్నింటినీ దాటుకుని ఆ సినిమా క్రమంగా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. చివరికి సైన్స్ ఫిక్షన్ అభిమానులు దాన్ని ఒక కల్ట్ క్లాసిక్ గా మార్చేశారు. అది కదా మన ప్రేక్షకుల గొప్పతనం.
అసలేం జరిగింది?
దక్షిణాఫ్రికా దర్శకుడు రిచర్డ్ స్టాన్లీ నానా కష్టాలు పడి 1990లో ఓ సినిమా మొదలెట్టాడు. దాని పేరు ‘హార్డ్‌వేర్’. ఇదే ఈ దర్శకుడు తొలి ఫీచర్ ఫిల్మ్ .అయితే మొదటి సినిమానే మట్టికొట్టుకుపోయింది భాక్సాఫీస్ దగ్గర. దానికి తోడు ఊహించని వివాదంలో చిక్కుకున్నారు.
ఈ సినిమా కథ 1981లో ప్రముఖ బ్రిటిష్ కామిక్ మ్యాగజైన్ ‘2000 AD’ వార్షిక సంచికలో వచ్చిన ‘SHOK’ అనే కామిక్ కథను పోలి ఉందంటూ బ్రిటిష్ ప్రచురణ సంస్థ ఫ్లీట్వే కామిక్స్ కేసు వేసింది.కోర్టులో చాలా కాలం నలిగింది.
చివరకు కేసు పరిష్కారం అయిన తర్వాత సినిమా చివరి క్రెడిట్స్‌లో ఫ్లీట్వే కామిక్స్‌తో పాటు ‘SHOK’ రచయితలకు కూడా గుర్తింపు ఇవ్వాల్సి వచ్చింది. అంటే వీళ్లు కాపీ కొట్టారు అని ఒప్పుకున్నారు. ఫైన్ కూడా కట్టారు అంటారు. అయితే ఆ మేటర్ బయిటకు రాలేదు. గోరు చుట్టుపై రోకలి పోటు అంటారు కదా , అలా అసలే సినిమా పోయి ఏడుస్తూంటే ఈ కాపీ కేసు ఒకటి అని ప్రొడ్యూసర్ తల పట్టుకున్నారు.
కానీ చేసేదేముంది. సినిమా కథ విన్నప్పుడే ఆయన గమనించాల్సింది. అయితే ఆయనకు అంత నాలెడ్జ్ ఉన్నట్లు లేదు. సరే అయ్యిందేదో అయ్యిపోయింది. డైరెక్టర్, నిర్మాత తమ ఏడుపు దిగమింగి మళ్లీ నెక్ట్స్ సినిమా పనుల్లోకి వెళ్లిపోయారు. అయితే అక్కడితో ఈ కథ ముగిస్తే దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం ఎందుకు.
విమర్శకులు పట్టించుకోలేదు… ప్రేక్షకులు మాత్రం వదల్లేదు
వాస్తవానికి ‘హార్డ్‌వేర్’ రిలీజ్ అప్పుడు అసలు ఏ రివ్యూ రైటర్ దీని గురించి పాజిటివ్ గా ఒక్క ముక్కా రాయలేదు. అసలు మాట్లాడినవాడే లేరు. ఇప్పుడంటే మంచికో,చెడుకో యూట్యూబ్ వీడియో రివ్యూలు ఉన్నాయి. అప్పట్లో అసలు అలాంటివి ఏవి. దాంతో చాలామంది దీన్ని తక్కువ బడ్జెట్‌తో తీసిన మరో సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాగానే చూశారు. ‘రోబోకాప్’, ‘బ్లేడ్ రన్నర్’ వంటి అప్పటికే పేరు తెచ్చుకున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాల ఇంపాక్ట్ ఈ సినిమాపై స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు కూడా వచ్చాయి. దానికి తోడు ‘SHOK’ కామిక్‌ను కాపీ కొట్టారనే వివాదం.
అయినా సినిమా పూర్తిగా కనుమరుగైపోలేదు.
ఇంత జరిగినా …చివరకు విమర్శకుల స్పందన అసలు లేకపోయినా ప్రేక్షకులు మాత్రం సినిమాను పూర్తిగా తిరస్కరించలేదు. సుమారు 15 లక్షల డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 57 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది.
అక్కడితో ఆగలేదు …సినిమా విడుదలైన తర్వాతి సంవత్సరాల్లో ఈ సినిమాకు క్రమంగా కొత్త ప్రేక్షకులు బయిలుదేరారు. ముఖ్యంగా సైబర్‌పంక్ ప్రపంచం, డిస్టోపియన్ భవిష్యత్తు, యంత్రాలపై భయం, చీకటి విజువల్ స్టైల్‌ను ఇష్టపడే అభిమానులు ‘హార్డ్‌వేర్’ గురించి మాట్లాడటం మొదలెట్టారు. అరే అప్పట్లోనే భలే తీసాడురా అని మెచ్చుకోవటం మొదలెట్టారు. అలా ఒకప్పుడు విమర్శల మధ్య నిలిచిన సినిమా క్రమంగా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఎందుకు కల్ట్ క్లాసిక్ అయింది?
నిజానికి కాపీ వివాదం వచ్చిన ఈ సినిమా మీద ఎవరికీ ప్రత్యేకమైన ప్రేమ ఉండదు. అయితే ఇక్కడ దాని కంటంటే సినిమాని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. సినిమా విజువల్ ప్రపంచం, దాని చీకటి వాతావరణం, పోస్ట్-అపోకలిప్టిక్ సెట్టింగ్, మనుషులను వేటాడే యంత్రం, సైబర్‌పంక్ శైలి—ఇవన్నీ కలిసి దానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
కథ ఎక్కడి నుంచి వచ్చిందనే వివాదం ఉన్నప్పటికీ, దాన్ని తెరపై చూపించిన విధానం ప్రేక్షకులలో ఒక వర్గానికి తెగ నచ్చేసింది.
అసలు ‘హార్డ్‌వేర్’ కథ ఏమిటి?
‘హార్డ్‌వేర్’ కథ ఒక పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచంలో సాగుతుంది. రేడియేషన్‌తో నాశనమైన ప్రాంతాలు పాత యంత్రాలు, లోహపు ముక్కలు, పనికిరాని వస్తువులతో నిండిపోతాయి. వాటిని సేకరించి అమ్ముకునే వాళ్లు కూడా ఉంటారు.
అల్వీ అనే స్క్రాప్ డీలర్ అలాంటి ప్రపంచంలో జీవిస్తుంటాడు. అతని సైనిక స్నేహితుడు ‘హార్డ్ మో’ బాక్స్టర్ ఒక శిథిలమైన రోబోట్‌ను కనుగొంటాడు. ఆ రోబోట్ శరీరాన్ని అల్వీకి ఇస్తాడు. అయితే దాని తలను మాత్రం తన ప్రేయసి జిల్కు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటాడు.
అయితే వాళ్ల చేతికి చిక్కింది సాధారణ రోబోట్ కాదు. అది M.A.R.K. 13 అనే అత్యంత ప్రమాదకరమైన యంత్రం. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించాలనే పేరుతో, సామూహిక హత్యల కోసం ప్రభుత్వమే రూపొందించిన ఆండ్రాయిడ్.
అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఆ రోబోట్ తనను తాను తిరిగి నిర్మించుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. విడిపోయిన యంత్ర భాగాలను మళ్లీ కలుపుకుంటూ, శిథిలాల నుంచి క్రమంగా పూర్తి రూపాన్ని పొందిన M.A.R.K. 13 చివరకు తన ముందున్న మనుషులనే వేటాడటం ప్రారంభిస్తుంది.ఇదే అసలు పాయింట్.
ఫైనల్ గా…
‘హార్డ్‌వేర్’ కథ కొత్తది కాకపోయినా, దాన్ని చెప్పే విధానం కొత్తగా ఉండటంతో జనాలు ఇంతకాలం అయ్యినా గుర్తు పెట్టుకున్నారు.అలాగే సైబర్‌పంక్ సినిమాల గురించి మాట్లాడినప్పుడు గుర్తుకొచ్చే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా చరిత్రలో ఉన్న ఆ విచిత్రమైన మలుపు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాపీ కొట్టిందనే ఆరోపణతో కోర్టు కేసు ఎదుర్కొన్న సినిమా… చివరికి కల్ట్ క్లాసిక్‌గా మారింది.








