కొండా కుటుంబం ఏ తీరానికి?
తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతుల శైలి ఎప్పుడూ దూకుడే. మంత్రి పదవి నుంచి అనూహ్యంగా బర్తరఫ్ కావడంతో మొదలైన ప్రకంపనలు ఇప్పుడు కొండా సురేఖ దంపతుల భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్రవ్యాప్త ఉత్కంఠను రేపుతున్నాయి. మంత్రి పదవి కోల్పోయిన వెంటనే శుక్రవారం ప్రభుత్వం ఆమెకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, గన్మెన్ల సంఖ్యను తగ్గించి కేవలం ఎమ్మెల్యే స్థాయి భద్రతకే పరిమితం చేయడంతో అధిష్ఠానం ఆమెపై ఏ స్థాయిలో కఠినంగా ఉందో స్పష్టమైంది. ఈ అవమానాల నడుమ ఆమె కాంగ్రెస్ పార్టీలో ఇమడడం దాదాపు అసాధ్యమనే నిర్ణయానికి రాజకీయ వర్గాలు వచ్చేశాయి. అయితే, కాంగ్రెస్‌కు రాంరాం చెబితే తదుపరి అడుగు ఎటువైపు అనేదే ఇప్పుడు అసలైన రాజకీయ చర్చ.
మంత్రి పదవి ఊడిన వెంటనే కొండా కుటుంబం బీజేపీ వైపు చూస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కొండా మురళీకి ఉన్న వ్యక్తిగత సత్సంబంధాలు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కొండా దంపతులు వస్తే ఆహ్వానిస్తామంటూ చేసిన ప్రకటనలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. కానీ, క్షేత్రస్థాయి సమీకరణాలు పరిశీలిస్తే కాషాయ దళం నుంచి కొండా దంపతులకు ఆశించిన స్థాయిలో బలమైన గ్రీన్ సిగ్నల్ లభించలేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న స్థానిక బీజేపీ నేతల అసంతృప్తి, వచ్చే ఎన్నికల్లో కొండా కుటుంబం ఆశిస్తున్న నిర్దిష్ట టికెట్ హామీలకు జాతీయ నాయకత్వం తలొగ్గకపోవడం ప్రతిబంధకంగా మారాయి. కమలం పార్టీ నుంచి నిర్దిష్టమైన రాజకీయ రక్షణ, స్పష్టమైన భరోసా దక్కకపోవడంతో ఆ దారి దాదాపు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది.
బీజేపీ నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో, కొండా దంపతులకు మళ్లీ గులాబీ గూడే శరణ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో జాబితాలోనూ ఆమె పేరు ప్రకటించకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్‌లోకి మారారు. ఒకసారి గులాబీ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చిన కొండా కుటుంబం మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లడం కష్టమేనని విశ్లేషకులు భావించినప్పటికీ, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడి మరోసారి నిజమవుతోంది.
మంత్రి పదవి కోల్పోయిన కొద్ది గంటల్లోనే కేసీఆర్ ఎంతో మంచివారని, ఎప్పుడూ తనను పల్లెత్తు మాట అనలేదని, అడగ్గానే మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటూ సురేఖ హఠాత్తుగా ప్రశంసల వర్షం కురిపించడం సాధారణ పరిణామం కాదు. తెరవెనుక గులాబీ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మాజీ మంత్రి హరీశ్‌రావుతో సంప్రదింపులు ముమ్మరంగా సాగుతున్నాయన్న వార్తలకు ఈ వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి.
అయితే బీఆర్ఎస్లోనూ కొండా దంపతుల చేరిక అంత సాఫీగా సాగేలా లేదు. సురేఖను బీఆర్ఎస్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ రానివ్వబోమని, తెలంగాణ భవన్ గేటును కూడా తాకనివ్వమని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి వంటి సీనియర్లు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. గతంలో కేటీఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలు, కోర్టు కేసుల నేపథ్యంలో గులాబీ కేడర్‌లోనూ అసంతృప్తి ఉంది. అయినప్పటికీ, కాంగ్రెస్‌లో ఉండలేక, బీజేపీ సానుకూలంగా లేకపోవడంతో కొండా కుటుంబానికి బీఆర్ఎస్సే ఏకైక ప్రత్యామ్నాయంగా మిగిలింది.
ముఖ్యంగా త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పట్టు నిరూపించుకోవాలని కొండా దంపతులు భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లోని 66 డివిజన్లలో 25 డివిజన్లు వరంగల్ తూర్పు పరిధిలోనే ఉన్నాయి. తమ కుమార్తె కొండా సుస్మితా పటేల్ రాజకీయ అరంగేట్రాన్ని దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెస్‌కు సమాంతరంగా ప్రత్యేక టీమ్‌లను సిద్ధం చేస్తూనే, గులాబీ పంచన చేరేందుకు కొండా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో గులాబీ బాస్ ఇచ్చే తుది సంకేతంపైనే కొండా దంపతుల భవితవ్యం ఆధారపడి ఉంది.








