Redmi Note 17 Pro Max: భారీ బ్యాటరీ.. సరసమైన ధర.. మరి కొనొచ్చా?
స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఒకప్పుడు మధ్యతరగతి వినియోగదారులకు సాంకేతిక విప్లవాన్ని పరిచయం చేసిన రెడ్మి నోట్ సిరీస్ నుంచి సరికొత్తగా ‘రెడ్మి నోట్ 17 ప్రో మ్యాక్స్’ (Redmi Note 17 Pro Max) మార్కెట్లోకి అడుగుపెట్టింది. గతంలో అత్యుత్తమ హార్డ్‌వేర్, సరసమైన ధరలతో రికార్డులు సృష్టించిన ఈ సిరీస్, గత రెండేళ్లుగా తన పాత ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన నోట్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ రికార్డు స్థాయి బ్యాటరీ సామర్థ్యంతో వచ్చినప్పటికీ, రోజువారీ పనితీరు, ప్రాసెసర్, మెమరీ విభాగాల్లో తీవ్రమైన నిరాశనే మిగిల్చిందని యూజర్లు అంటున్నారు.
బ్యాటరీ సామర్థ్యంలో సరికొత్త రికార్డు
ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకునే ప్రధానమైన అంశం దీని బ్యాటరీ. ఇందులో ఏకంగా 9,210 mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీని అమర్చారు. సాధారణ వినియోగంలో ఈ ఫోన్ రెండున్నర రోజుల నుంచి మూడు రోజుల పాటు సులభంగా పనిచేస్తుంది. గేమింగ్, స్ట్రీమింగ్ వంటి భారీ వినియోగంలో సైతం ఎలాంటి అంతరాయం లేకుండా రెండు (Redmi Note 17 Pro Max) పూర్తి రోజుల బ్యాకప్‌ను అందిస్తుంది. ఇంత భారీ బ్యాటరీని వేగంగా నింపేందుకు 100W యూఎస్బీ పీడీ 3.0 (USB PD) ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు. దీని ద్వారా కేవలం ఒక గంటలోనే ఫోన్‌ను సున్నా నుండి వంద శాతం పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఇంతటి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మరో డివైజ్ ప్రస్తుతానికి లేకపోవడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్.
డిజైన్, డిస్ప్లే క్వాలిటీ
ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ (Redmi Note 17 Pro Max) చేతిలో పట్టుకున్నప్పుడు ఏమాత్రం అసౌకర్యంగా లేదా ఇటుక రాయిలా భారంగా అనిపించదు. గెలాక్సీ ఎస్26 అల్ట్రాతో సమానమైన కొలతలతో, చక్కటి ఫ్లాట్ డిజైన్‌తో రూపొందించారు. పాలికార్బోనేట్ మిడ్-ఫ్రేమ్‌తో దృఢమైన నిర్మాణాన్ని అందించడంతో పాటు, దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68, ఐపీ69కే (IP68 & IP69K) రేటింగ్‌ను జోడించారు. ఇక ముందు భాగంలో అందించిన 6.83 అంగుళాల 120Hz ఓఎల్ఈడీ (OLED) డిస్ప్లే అద్భుతమైన రంగులను, స్పష్టతను అందిస్తుంది. క్లౌడ్ బ్లష్ కలర్ వేరియంట్ లైట్ పడినప్పుడు ఆకర్షణీయంగా మెరుస్తూ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.
ప్రాసెసర్, పనితీరులో డౌన్‌గ్రేడ్
డిజైన్, బ్యాటరీలో మెప్పించిన షావోమి.. హార్డ్‌వేర్ విషయంలో మాత్రం తీవ్రమైన (Redmi Note 17 Pro Max) తిరోగమనాన్ని ప్రదర్శించింది. గత ఏడాది మోడల్లో అధునాతన ఏ720, ఏ520 కోర్లతో కూడిన స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌ను అందించగా, తాజా నోట్ 17 ప్రో మ్యాక్స్‌లో పాత తరం ఏ78, ఏ55 కోర్లతో పనిచేసే ‘స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5’ ప్రాసెసర్‌ను వాడారు. దీనివల్ల ఫోన్ పనితీరులో గణనీయమైన నెమ్మదితనం కనిపిస్తోంది. మల్టీటాస్కింగ్ సమయంలో స్పష్టంగా ల్యాగ్ ఉండటంతో పాటు, గ్రాఫిక్స్ అధికంగా ఉండే హై-ఎండ్ మొబైల్ గేమింగ్ ఆడటం వినియోగదారులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తుంది. దీనికి తోడు బేస్ మోడల్లో కేవలం 8GB ర్యామ్, పాత UFS 2.2 స్టోరేజ్‌ను మాత్రమే ఇవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసే అంశం.
కెమెరా పరిమితులు, సాఫ్ట్వేర్ లోపాలు
ఫోన్లోని (Redmi Note 17 Pro Max) 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా పగటి వెలుతురులో సాధారణ ఫోటోలను బాగానే తీస్తుంది. అయితే తక్కువ వెలుతురులో దీని పనితీరు అంతగా ఆకట్టుకోదు. ఇందులో ప్రత్యేకమైన టెలిఫోటో లెన్స్ లేకపోవడం, వైడ్-యాంగిల్ కెమెరా సామర్థ్యం నామమాత్రంగా ఉండటం గమనార్హం. అన్నింటికంటే ముఖ్యంగా వీడియో రికార్డింగ్‌లో ఇప్పటికీ 4K 60fps సదుపాయాన్ని కల్పించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు, గూగుల్ ఇప్పటికే సరికొత్త ఆండ్రాయిడ్ 17 స్థిరమైన వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసినప్పటికీ, షావోమి ఈ ఫోన్‌ను పాత ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తోనే మార్కెట్లోకి తీసుకురావడం సాఫ్ట్వేర్ పరంగా వెనుకబాటుతనాన్ని స్పష్టం చేస్తోంది. 499 డాలర్లు (దాదాపు రూ. 42,000) వెచ్చించి కొనుగోలు చేసే వినియోగదారులను (Redmi Note 17 Pro Max) కేవలం బ్యాటరీ తప్ప మిగిలిన అన్ని విషయాల్లో నిరాశకే గురిచేసిందని చెప్పాలి.








