ఇటలీ ప్రధాని మెలోనీ సరికొత్త రికార్డ్…!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం సుదీర్ఘకాలం పదవిలో ఉన్న ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోనీ రికార్డు నెలకొల్పారు. మెలోనీ 1,413 రోజుల పాటు నిరంతరాయంగా అధికారంలో కొనసాగి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సుదీర్ఘకాలం పదవిలో ఉన్న ప్రధానిగా నిలిచారు.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వాలు సగటున 14 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నాయి. గత 80ఏళ్లలో ఇటలీ 68 ప్రభుత్వాలను చూసింది. అందుకు భిన్నంగా మెలోని ప్రభుత్వం రాజకీయ సంక్షోభాలు లేకుండా 2022 నుంచి నిరంతరాయంగా అధికారంలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో మెలోనీకి వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని మోడీ.. తన స్నేహితురాలు, ఇటలీ ప్రధాని మెలోనీకి శుభాకాంక్షలు అందించారు. ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలు ఉంచిన నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు. భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఆమె స్నేహం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఇక ముందు కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీకి ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.








