మండలి పోరుకు కాంగ్రెస్ కసరత్తు..!
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో జరగనున్న మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి, అలాగే నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల వేడి గాంధీభవన్‌లో ఇప్పుడే మొదలైంది. అక్టోబర్ నెల నుంచి ఓటరు నమోదు కార్యక్రమాలు ప్రారంభం కానుండటంతో, అధికార పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతల హడావిడి పీక్స్‌కు చేరింది.
ఈ రెండు పట్టభద్రుల స్థానాల పరిధిలో ఉమ్మడి ఆరు జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పట్టభద్రుల తీర్పు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మారే అవకాశం ఉండటంతో, ఫలితం తేడా వస్తే భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న అంచనాతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కీలక మంత్రులు అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు పేర్లతో కూడిన షార్ట్‌లిస్ట్‌ను అధిష్ఠానానికి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి ఆశావహులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరిపి జాబితా రూపొందించారు. పార్టీ సీనియర్ నేత, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ విభాగం మాజీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డికి ఉపాధ్యాయ సంఘాల నేపథ్యం ఉంది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నాయి. టీశాట్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, బీసీ నేత గౌరి సతీష్, షాప్ మాజీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు సభ్యుడు రాకూర్ బాలాసింగ్ పేర్లను కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది.
ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీఐ కమిషనర్ పి.వి. శ్రీనివాస్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పోటీ చేసిన ఇందిర, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, పార్టీ నేత లోకేష్ యాదవ్, ఖమ్మం విద్యాసంస్థల అధినేత మొండిం కిరణ్‌కుమార్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. మరోవైపు పొత్తులో భాగంగా ఈ సీటు తమకు కేటాయించాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరుతుండటం గమనార్హం.
పట్టభద్రుల స్థానాలతో పాటు నవంబర్, డిసెంబర్ నెలల్లో నాలుగు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు భర్తీకి రానున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14న ముగియనుంది. డిసెంబర్ 18న మధుసూదనాచారి పదవీకాలం పూర్తవుతుంది. ఈ నాలుగు నామినేటెడ్ స్థానాలు కూడా అధికార కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనున్నాయి. కళాకారుల కోటాలో సీఎంతో సన్నిహిత సంబంధాలున్న గోరటి వెంకన్నను మళ్లీ కొనసాగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ద్వారా నామినేట్ అయి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న బస్వరాజు సారయ్య మళ్లీ అవకాశం ఆశిస్తున్నారు. మరోవైపు సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పేర్లు గవర్నర్ కోటా రేసులో బలంగా వినిపిస్తున్నాయి.
సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రియాలిటీని బేరీజు వేసుకుంటూ, ఆశావహుల అసంతృప్తి పార్టీపై పడకుండా శాసనమండలి పోరులో క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా హస్తం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది.








