మరోసారి బద్దలైన అనక్ క్రాకటా .. విమానాశ్రయాల్లోనే లక్షలాది మంది ప్రయాణికులు..!
ఇండోనేసియా (Indonesia)లోని సుందా జలసంధిలో ఉన్న అనక్ క్రాకటా (Mount Anak Krakatau) ..
విమాన ప్రయాణికులను టెన్షన్ పెడుతోంది. మరోసారి బద్దలైన అనక్ క్రాకటా నుంచి పెద్ద ఎత్తున బూడిద వెలువడుతుండడంతో సమీప ప్రాంతంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి క్రియాశీలకంగా ఉన్న ఈ అగ్నిపర్వతం మొదట ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. అర్ధరాత్రి సమయంలో కూడా మరో రెండు సార్లు అందులో పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దట్టమైన పొగ, బూడిద కమ్మేయడంతో దేశవ్యాప్తంగా 8 విమానాశ్రయాలను మూసివేశారు (Airports Shut). దీంతో 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.
మరోవైపు, సుందా జలసంధిలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అగ్నిపర్వతం చుట్టూ 3 కిలోమీటర్ల మేర నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. ఆ ప్రాంతంలోకి వెళ్లొద్దని స్థానికులు, పర్యాటకులకు ఆదేశాలు జారీ చేశారు. జకార్తా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు.
రెండు రోజులుగా విమానాలు రద్దవడంతో విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు (Passengers Stranded). ఆదివారం 746 దేశీయ, 272 అంతర్జాతీయ విమానాల సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం 8 విమానాశ్రయాల్లో కలిపి మొత్తం 1,500కు పైగా విమాన రాకపోకలను నిలిపివేశారు.








