తెలుగు టైమ్స్ డైరెక్టర్లుగా శివ దువ్వూరు, గౌరీశంకర్
అమెరికాలోని ఎన్ ఆర్ ఐ (తెలుగు) సమాజానికి గత 23 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న తొలి గ్లోబల్ తెలుగు వార్తాపత్రిక ‘తెలుగు టైమ్స్’(శాన్ ఫ్రాన్సిస్కో), నేడు తన బోర్డులోకి ఇద్దరు కొత్త డైరెక్టర్లను చేర్చుకున్నట్లు ప్రకటించింది. 2004 లో 10,000 ప్రతులతో ప్రింట్ ఎడిషన్ గా ప్రారంభమైన తెలుగు టైమ్స్, నేడు ప్రింట్ ఎడిషన్ తో పాటు ఈ-పేపర్, వెబ్ పోర్టల్, యూట్యూబ్ ఛానెల్, లైజన్ ఏజెన్సీ, ఈవెంట్ ఆర్గనైజర్ మరియు మీడియా కోఆర్డినేటర్ గా విస్తరించి ఒక ప్రముఖ మీడియా హౌస్ గా ఎదిగింది. కోవిడ్ అనంతర కాలంలో ఆన్లైన్ మాధ్యమం యొక్క ప్రాముఖ్యతను మరియు భవిష్యత్తును గుర్తించిన తెలుగు టైమ్స్, డిజిటల్ దిశగా అడుగులు వేసింది. నేడు తన వెబ్ సైట్ (www.telugutimes.net)లో రోజుకు 100కి పైగా వార్తలు, కథనాలు, ఫోటోలు, వీడియోలు, అమెరికాలోని తెలుగు సంఘాల ఈవెంట్ ఫ్ల్లయర్స్ మొదలైనవాటిని పోస్ట్ చేస్తూ, రోజువారీగా దాదాపు 1 లక్ష మంది వీక్షకులను చేరుకుంటోంది. ఆగస్టు 2026 నాటి గూగుల్ అనలిటిక్స్ ప్రకారం, అత్యుత్తమ ఎంగేజ్మెంట్ టైమ్ తో 2 మిలియన్లకు పైగా వీక్షకుల రీచ్ సాధించింది.
ఈ సందర్భంగా తెలుగు టైమ్స్ ఎడిటర్, పబ్లిషర్ మరియు సీఈఓ శ్రీ వెంకట సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ… గత 10 నెలలుగా హైదరాబాద్, రాజమండ్రి మరియు యుఎస్ ఏ లలో కార్యాలయాలు కలిగిన ‘నైస్ డిజిటల్స్’అనే డిజిటల్ మార్కెటింగ్ సంస్థ చేపట్టిన అగ్రెసివ్ డిజిటల్ మార్కెటింగ్ వల్లే తెలుగు టైమ్స్ ఆన్లైన్ ఎడిషన్ ఈ స్థాయి వృద్ధిని సాధించిందని తెలిపారు.
10 ఏళ్ల క్రితం రాజమండ్రిలో ఐటీ సేవల సంస్థగా ‘నైస్ డిజిటల్స’ను ప్రారంభించిన దాని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గౌరీ శంకర్ సీలం, రాజమండ్రిలో 500 మందికి పైగా, హైదరాబాద్ లో దాదాపు 50 మంది సిబ్బందితో గ్లోబల్ క్లయింట్లకు ఐటీ సేవలను అందిస్తున్నారు. ఆయన ఈ నెల నుండి తెలుగు టైమ్స్ లో భాగస్వామిగా (పార్ట్నర్) మరియు డైరెక్టర్ గా చేరారు. డిజిటల్ మార్కెటింగ్, ఇతర ఐటీ సేవలలో విస్తృత అనుభవం, గ్లోబల్ క్లయింట్లతో పనిచేసిన అనుభవం ఉన్న శ్రీ గౌరీ శంకర్ కలయిక తెలుగు టైమ్స్ ను మరింతగా ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
కాలిఫోర్నియాలోని శాన్ హోసెలో ఉంటున్న ప్రముఖ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ (సిపిఎ) శ్రీ శివ దువ్వూరును కూడా బోర్డులోకి తీసుకున్నట్లు సుబ్బారావు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ మరియు ట్యాక్స్ రంగంలో ఆయనకు 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు భాగస్వాములుగా, బోర్డు సభ్యులుగా చేరడంతో… ఎన్ ఆర్ ఐ తెలుగు సమాజానికి మరియు తెలుగు రాష్ట్రాలకు మధ్య ఒక నిజాయితీగల మీడియా వారధిగా తెలుగు టైమ్స్ ఇప్పుడు మరింతగా చేరువవుతుందని శ్రీ సుబ్బారావు తెలియజేశారు.








