పవన్ మాటలెక్క చేయకపోతే రిజల్ట్ ఇలా ఉంటుందా..?
రాజమహేంద్రవరంలోని ప్రముఖ పరిశ్రమ ‘ఆంధ్రా పేపర్ లిమిటెడ్’ (Andhra Paper Limited) పై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) భారీ అస్త్రం ప్రయోగించింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తూ, పవిత్ర గోదావరి నదిని కాలుష్య కోరల్లోకి నెడుతున్న ఈ సంస్థపై ఏకంగా రూ. 21.1 కోట్ల భారీ జరిమానా విధిస్తూ పిసిబి కొరడా ఝుళిపించింది. అయితే, ఈ వ్యవహారంలో అత్యంత సంచలనమైన విషయం ఏంటంటే.. ఏకంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి హెచ్చరించినా సదరు యాజమాన్యం ఏమాత్రం లెక్కచేయకపోవడం, చివరకు ఈ భారీ పెనాల్టీకి దారితీయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
గత మే 26న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తూర్పులంక పరిసర ప్రాంతాల్లో పర్యటించి, గోదావరి నదిలో పేరుకుపోయిన ఇసుక మేటలు మరియు ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల తీవ్రతను స్వయంగా పరిశీలించారు. గోదావరి నది పరిసరాలపై, స్థానిక పర్యావరణంపై ఈ వ్యర్థాలు చూపిస్తున్న ప్రతికూల ప్రభావంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణలో ఉన్న లోపాలను తక్షణమే సరిదిద్దుకోవాలని, పర్యావరణ నిబంధనలు పాటించాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి హెచ్చరించినా ఆంధ్రా పేపర్ లిమిటెడ్ యాజమాన్యం ఆ లోపాలను సరిదిద్దడంలో పూర్తిగా విఫలమైంది.
కాలుష్య నియంత్రణ మండలి గతంలో ఈ సంస్థకు పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ హెచ్చరికలు పంపింది. అయినా యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు, పదేపదే పిసిబి నిబంధనలను ఉల్లంఘిస్తూ గోదావరి నదిలోకి ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేస్తూనే వచ్చింది. డిప్యూటీ సీఎం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ కంపెనీ తీరుపై కాలుష్య నియంత్రణ మండలి తీవ్రంగా పరిగణించింది. ఈ నిర్లక్ష్యానికి తగిన శాస్తి చేస్తూ రూ. 21.1 కోట్ల భారీ జరిమానా విధించడమే కాకుండా, నిబంధనలు పాటించకపోతే తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించింది.








