బెజవాడ మేయర్ పీఠం.. రేసులో 15 మంది..!
విజయవాడ(Vijayawada) నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమిలో అంతర్గత పోటీ ఏ రేంజ్లో ఉందో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చేసిన తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. విజయవాడ మేయర్ స్థానం కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన కొట్లాట నడుస్తోందంటూ వస్తున్న వార్తలపై ఎంపీ చిన్ని అధికారికంగా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మేయర్ అభ్యర్థిత్వం కోసం పార్టీలో భారీగా డిమాండ్ ఉందని, దీనిపై తుది నిర్ణయం అధినేతదేనని ఆయన తేల్చి చెప్పారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా సిద్ధార్థ్(Bonda Siddarth) పేరు మేయర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యవహారంపై ఎంపీ కేశినేని చిన్ని కీలక కన్ఫర్మేషన్ ఇచ్చారు. “బొండా ఉమ గారు తన కుమారుడికి విజయవాడ మేయర్ టికెట్ ఇవ్వాలని పార్టీని కోరుతున్న మాట వాస్తవమే” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేవలం బొండా కుటుంబం మాత్రమే కాకుండా.. ఈ ప్రతిష్టాత్మక మేయర్ స్థానం కోసం తమ పార్టీలో 15 మందికి పైగా అభ్యర్థులు గట్టిగా పోటీ పడుతున్నారని చిన్ని వెల్లడించారు.
నగరవ్యాప్తంగా ఇంతమంది ఆశావహులు పోటీ పడుతున్న నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్ సమీకరణాలను బట్టి అభ్యర్థిని ఖరారు చేస్తారని ఎంపీ తెలిపారు. “విజయవాడ మేయర్ సీటులో ఎవరిని పోటీ చేయించాలి.. ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాలను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షించి ఫైనల్ చేస్తారు” అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కార్పొరేషన్ ఎన్నికలపై వస్తున్న కొన్ని ప్రచారాలను ఆయన ఖండించారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని తాను సీఎం చంద్రబాబును కోరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ప్యూర్ అవాస్తవాలని ఎంపీ కేశినేని చిన్ని కొట్టిపారేశారు.








