ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ, సెప్టెంబరు 05: విద్యార్థులను భవిష్యత్ ప్రపంచానికి సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కోర్సులను రీస్ట్రక్చరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏఐ, క్వాంటం, రోబోటిక్స్, డేటా అనలటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశ భవిత అయిన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను ముఖ్యమంత్రికి వివరించారు.
ఏఐ వంటి వ్యవస్థలు వచ్చినా ఉపాధ్యాయుల స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని. టీచర్ల వద్ద లేని సమాధానం ఏఐ కూడా చెప్పలేదని చంద్రబాబు అన్నారు. సాంకేతికతతో పాటు విద్యార్థుల్లో విలువలు, సంస్కృతి, దేశభక్తి, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించాలని సూచించారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై మరింత పెరిగిందన్నారు. విద్య కేవలం థియరీకి పరిమితం కాకూడదని, విద్యార్థులు బయటకు వెళ్లి అనుభవపూర్వకంగా నేర్చుకునేలా అవకాశాలు కల్పించాలని సూచించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలన్నదే తన ఆలోచనగా వెల్లడించారు. భవిష్యత్తును ముందుగానే ఊహించి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నామని సీఎం చెప్పారు. పాలనా సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలు తెలుగు వారిని అగ్రస్థానంలో నిలిపాయని పేర్కొన్నారు. వచ్చే 10-15 ఏళ్లలో విభిన్నమైన భారతదేశాన్ని చూడబోతున్నామని అన్నారు.
2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత
ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలను ప్రత్యేక బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.చదువుకునే వయసులో ప్రతి విద్యార్థి బడిలో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివేలా ప్రోత్సహించాలని, ఆవిష్కరణలు, సృజనాత్మకత, కష్టాలను ఎదుర్కొనే తత్వాన్ని వారిలో పెంచాలని సూచించారు. ఏడో తరగతి చదివే విద్యార్థులు సైతం ఏఐలో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి పాఠశాలా మోడల్ స్కూల్‌గా మారితే కుటుంబాలు, గ్రామాలు, చివరకు దేశం మారుతుందని చెప్పారు. విద్యార్థులను నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్దాలని కోరారు. క్రీడలు, ప్రకృతితో విద్యార్థులను అనుసంధానం చేయాలని, ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. 2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. క్లిక్కర్, ఏఐ ట్యూటర్ వంటి సాంకేతికతలను ఉపయోగించి బోధనలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు.
2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఆ లక్ష్యానికి పునాది పాఠశాలల్లోనే పడాలని, దాన్ని సాధించేది ఉపాధ్యాయులేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపాధ్యాయుల నియామకాలు అవసరమనే ఆలోచనతో తమ హయాంలోనే డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకంపైనే చేశామని చెప్పారు. నియామకాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు 350కి పైగా పిటిషన్లు వేసినా వాటన్నింటినీ అధిగమించి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఉపాధ్యాయుల ప్రతిభే వారికి కొలమానంగా ఉండేలా కౌన్సెలింగ్ ప్రక్రియను తీసుకొచ్చామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చామని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పారు.
సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొందాం
టెక్నాలజీతో ఉపాధ్యాయులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. టీచింగ్ ప్రోఫెషన్ పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. గతంలో దండనతో అయినా పాఠాలు నేర్పించేవారని ఇప్పుడు కనీసం తిట్టినా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. సున్నిత మైన పరిస్థితుల మధ్య ఉపాధ్యాయులు వివేకంతో ఆలోచన చేసి వ్యవహారాన్ని చక్కబెట్టాలని అన్నారు. మానసిక బలహీనతతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. సామాజిక మాధ్యమాల ప్రభావంతో చెడు అలవాట్లకు బానిస అవుతున్నారని ఈ పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ తీరుకు అద్దం పడుతున్నాయన్నారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ప్రిన్సిపల్ ను చంపేశారని, విజయనగరంలో ఓ పిల్లాడు తల్లినే హత్యచేశాడని అన్నారు. విశాఖలో టీచర్ ఓ దెబ్బ కొట్టగానే 6 ఏళ్ల బాబు షాక్ తో ప్రాణాలు విడిచాడని గతంలో ఈ తరహా ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో విద్యాబోధన సవాళ్లతో కూడిన అంశంగా మారిపోయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కారంగా ఆధ్యాత్మికతను, యోగా, ధ్యానం లాంటి ఉత్తమ పద్ధతుల్ని అలవాటు చేయాలని సీఎం పిలుపునిచ్చారు.


ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వరాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం పలు వరాలు ప్రకటించారు. 12వ పీఆర్సీ నియామకానికి అంగీకారం తెలిపామని చెప్పారు. రెండు డీఏలను అక్టోబరు నుంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 2022 సరెండర్ లీవ్ మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10-15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ప్రతి నెలా జమ చేసేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల్ని కలుపుకుని వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గతంలో ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తేదీన జీతాలు అందేవి కావని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా చేశామని అన్నారు. గత పాలకులు ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద క్యూలో నిలబెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎప్పుడూ గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే అత్యుత్తమం అని సీఎం అన్నారు. విలువలను , సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి, ప్రకృతి పట్ల ప్రేమను విద్యలో భాగం చేయాలని సూచించారు. జీవితాంతం నేర్చుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు. భారత్ మళ్లీ విశ్వగురు స్థానానికి రావాలంటే అది ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని… విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దాలని సీఎం ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 175 మంది ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సత్కరించారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. అవార్డు సాధించిన దివ్యాంగ ఉపాధ్యాయుడు ఎం.పద్మనాభం ను సత్కరించేందుకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి స్వయంగా వేదిక దిగివెళ్లారు. ఆయనను సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ వర్లరామయ్య,ఎంపీ కేశినేని శివనాథ్ సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.








