మనిషికి ప్రాణం పోస్తున్న పందులు!!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
పందులు ప్రాణాలు మనం చాలా క్యాజువల్ గా తీసేస్తూంటాం. అయితే అవి మాత్రం మనకు ప్రాణాలు పొయ్యిటానికి నడుం బిగిస్తున్నాయి. అవును … ఆ బురదలో దొర్లే జంతువే, మనం శుభ్రత లేదని అసహ్యించుకునే జీవే. కానీ ఇప్పుడు అక్షరాలా అదే పంది ఇప్పుడు మనిషికి ప్రాణ బిక్ష పెట్టేందుకు ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెడుతోంది.నమ్మబుద్ది కావటం లేదా…కానీ ఇది నిజం. ఇదే నిజం.
అసలు ఈ పందుల మేటరేంటి
మనకు ఇంత అసహ్యం అనిపించే పందిని వైద్యశాస్త్రం మాత్రం చాలా కాలంగా మరో కోణంలో చూస్తోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, పంది శరీరంలోని కొన్ని అవయవాల పరిమాణం, నిర్మాణం మనిషి అవయవాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీలు, గుండె వంటి అవయవాల విషయంలో పందులు వైద్య పరిశోధనలకు చాలాకాలంగా ఇంట్రస్టింగ్ గా మారాయి. అలాగని పంది అవయవాలు డైరెక్ట్ గా తెచ్చేసుకుని మనిషికి పెట్టేయలేం. ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది.
పందులు గానీ మరో ఏదైనా జంతువు కానీ చివరకు మనిషి నుంచి అయినా అవయవాలు తెచ్చుకుని మన శరీరంలో అమరిస్తే… మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వెంటనే పరాయి వస్తువుగా గుర్తించి తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. అందుకే మన వైద్య ప్రపంచం దానికో పరిష్కారం కనుక్కుంది. జన్యుపరంగా మార్పులు చేసి మనకు తగినట్లుగా మార్చి అమర్చటం. అది సాధ్యమైనా?
సాధ్యమే…అలా జన్యుపరంగా మార్చిన ఒక పంది కిడ్నీని.. కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేసిన 67 ఏళ్ల వ్యక్తి శరీరంలో అమర్చారు. అది ఒకటి రెండు రోజులు కాదు…ఏకంగా 271 రోజుల పాటు పనిచేసింది. అంటే దాదాపు తొమ్మిది నెలలు. ఆ తొమ్మిది నెలలూ అతడికి డయాలసిస్ అవసరం లేకుండా చేసింది. ఆ తర్వాత ఆ కిడ్నీ పనిచేయడం ఆపేసింది. ఇలా ఆగిపోతే ఫలితం ఏముంది అంటారా. ఆ పంది కిడ్నీ అతడికి ఒక అత్యంత విలువైన బహుమతి ఇచ్చింది. అదే సమయం.
ఈ పంది కిడ్నీ ఆగిపోయిన సమయానికే అతడికి మానవ కిడ్నీ దొరికింది. చివరకు మానవ కిడ్నీ మార్పిడి కూడా విజయవంతమైంది. అంటే మానవ కిడ్నీ దొరికేటంత వరకూ ఆప్షన్ గా అది వర్కవుట్ అయ్యింది. అది చాలదా.
అయితే ఇది అనుకున్నంత చిన్న ప్రాసెస్ కాదు..
డైరక్ట్ గా పంది కిడ్నీని తీసుకుని మనిషికి సరిపెట్టలేదు.అది పుట్టకముందే ఆ పందిని, దాని అవయవాలు మనిషికి దగ్గరగా పనిచేసేలా జన్యు స్థాయిలో మార్చే ప్రయత్నం చేశారు. ఇదే ఈ కథలో అసలు టెక్నాలజీ.
ఏంటి దీని ఉపయోగం
ఖచ్చితంగా చెప్పాలి అంటే మనిషికి కిడ్నీ కావాలి… కానీ వెంటనే మనిషి కిడ్నీ దొరకదు!
కొంతమంది నెలలు. కొంతమంది సంవత్సరాలు.ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో చాలామంది డయాలసిస్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.డయాలసిస్ అనేది ప్రాణాలను నిలబెట్టే చికిత్సే. కానీ అది మామూలు జీవితం కాదు.
వారం వారం ఆసుపత్రి చుట్టూ తిరగాలి. శరీరం అలసిపోతుంది. జీవితం మొత్తం ఒక చికిత్స షెడ్యూల్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడే ఈ టెక్నాలజీ అవసరం ఎంతగొప్పదో తెలుస్తుంది. మనిషి కిడ్నీ దొరికే వరకు పంది కిడ్నీతో పని నడిపే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇది ఒక వంతెనలా పనిచేయవచ్చు.
ఈ ప్రయోగం పూర్తిగా సక్సెస్ అయితే జంతువుల అవయవాలను మనిషి శరీరానికి ఉపయోగపడేలా మార్చగలమా? అనే దిశగా మరిన్ని ప్రయోగాలు జరుగుతాయి. భవిష్యత్తులో వైద్య రంగం పూర్తిగా మారిపోవచ్చు.








