మోహన్‌లాల్ – విష్ణు మోహన్ పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘ఆపరేషన్ గంగా’
సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఎల్367గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి విష్ణు మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బైజు గోపాలన్, వి.సి. ప్రవీణ్ కో-ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. ఆయన తొలి చిత్రం ‘మెప్పడియాన్’తోనే నేషనల్ అవార్డు అందుకుని గుర్తింపు తెచ్చుకున్నారు.
‘ఆపరేషన్ గంగా’ ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన చారిత్రాత్మక ఎవాక్యుయేషన్ మిషన్. ఈ సినిమా షూటింగ్ జార్జియాలో ప్రారంభమైంది. త్వరలో మోహన్‌లాల్ షూటింగ్లో జాయిన్ కానున్నారు. పోలాండ్, జార్జియా, కజకిస్థాన్, ఢిల్లీ, డెహ్రాడూన్, కొచ్చి ప్రాంతాల్లో మొత్తం 180 రోజుల పాటు షూటింగ్ జరిపేలా ప్లాన్ చేశారు.
మోహన్‌లాల్‌తో పాటు బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్, అదిల్ హుస్సేన్, భాగ్యశ్రీ బోర్సే, పార్తిబన్ తదితర ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. విదేశాలతో పాటు బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమాను శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందిస్తున్నారు.
‘ఆపరేషన్ గంగా’కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ‘ధురంధర్’ పాన్ ఇండియా సినిమా భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ శశ్వత్ సచ్దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మిరోస్లావ్ కుబా బ్రోజెక్ ఈ సినిమాకు కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘ధురంధర్’, ‘కిల్’ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన సే యంగ్ ఓ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
‘గోట్’, ‘మేయాజగన్’, ‘అమరన్’, ‘కథానార్’ వంటి సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన రాజీవన్, ఎడిటర్ షమీర్ మహమ్మద్, ‘ధురంధర్’, ‘ఉరి’, ‘3 ఇడియట్స్’, ‘పద్మావత్’ వంటి చిత్రాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ బిశ్వదీప్ ఛటర్జీ, ‘కాంతారా’ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కె.వి. సంజిత్, ‘సఫేద్ సాగర్’, ‘బోర్డర్ 2’, ‘ఫైటర్’ వంటి సినిమాలకు మిలిటరీ అడ్వైజర్‌గా పనిచేసిన స్క్వాడ్రన్ లీడర్ వెర్లిన్ పన్వర్, ‘లోక’ కాస్ట్యూమ్ డైరెక్టర్ మెల్వీ జె, మేకప్ ఆర్టిస్ట్ రోనెక్స్ జేవియర్, ప్రొడక్షన్ కంట్రోలర్ రిన్నీ దివాకర్ తదితర ప్రముఖ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై ప్రస్తుతం సురేష్ గోపీ నటిస్తున్న ‘ఒట్టకొంబన్’, జయసూర్య నటిస్తున్న ‘కాంతనార్’, ఎస్.జె. సూర్య దర్శకత్వం వహిస్తున్న ‘కిల్లర్’ వంటి భారీ ప్రాజెక్ట్స్ కూడా తెరకెక్కుతున్నాయి.








