కేసీఆర్ రాజీనామా అస్త్రంతో కాంగ్రెస్ ‘మహా ధర్నా’!
తెలంగాణ రాజకీయ యవనికపై ప్రధాన పార్టీల మధ్య పోరు రోజురోజుకూ మరింత పదునెక్కుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకుంటున్న కీలక తరుణంలో, విపక్ష బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా సరికొత్త రాజకీయ అస్త్రాన్ని రేవంత్ సర్కార్ సంధించింది. అందులో ప్రధానమైనది కేసీఆర్ రాజీనామా డిమాండ్. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, సభకు రాని విపక్ష నేత పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా మహా ధర్నాకు సమరశంఖం పూరించింది.
రాష్ట్ర సచివాలయం నుంచి క్షేత్రస్థాయి దాకా కాంగ్రెస్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. ఇప్పుడు దానిని రాజధాని కేంద్రంగా మహా ధర్నాగా మార్చి రాష్ట్రవ్యాప్త రాజకీయ చర్చగా మలచాలని కాంగ్రెస్ నేతలు పావులు కదిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ ధర్నా రూపురేఖలను నిర్దేశించారు.
వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా ప్రజాధనం నుంచి జీతం తీసుకుంటూ అసెంబ్లీ ముఖం చూడరా? నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరా? ప్రతిపక్ష పాత్రను గాలికొదిలేస్తారా? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సంధించిన సూటి ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు రాజకీయంగా ఇరకాటంగా మారాయి. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించనప్పుడు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వందేళ్ల విధ్వంసం జరిగిందని, ఆ నష్టాన్ని పూడుస్తూ తమ వెయ్యి రోజుల పాలనలో సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లామని కాంగ్రెస్ వాదిస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కాంగ్రెస్ తొలి లక్ష్యం కాగా.. కేసీఆర్ గైర్హాజరును ప్రజల ముందు నిలబెట్టడం రెండో ప్రధాన వ్యూహం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలను పదేపదే లేవనెత్తడం ద్వారా, విపక్షంగా బీఆర్ఎస్ వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని కాంగ్రెస్ యోచిస్తోంది.
ఆదివారం నాటి మహా ధర్నాను భారీ శక్తి ప్రదర్శనగా మార్చేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలను సమీకరించే బాధ్యతను డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలకు అప్పగించారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ తదితర ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు మీడియా సమావేశాల ద్వారా ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి.
వెయ్యి రోజుల పాలనా ప్రగతిని ప్రజల ముందుంచుతూనే, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను టార్గెట్ చేసి రాజీనామా డిమాండ్‌ను తెరపైకి తేవడం ద్వారా బీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టే పక్కా పొలిటికల్ మైండ్‌గేమ్‌ను కాంగ్రెస్ విజయవంతంగా అమలు చేస్తోంది. ధర్నా చౌక్ వేదికగా ఆదివారం జరగనున్న ఈ మహా ధర్నా తెలంగాణ రాజకీయాల్లో మరో తీవ్ర స్థాయి మాటల యుద్ధానికి నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది.








