పుస్తకం కొంటే రూ.10 కోట్లు! ఏంటా పుస్తకం… ఏమా కథ?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
పుస్తకాలు చదివి జీవితాలు మారిన వాళ్లు బోలెడు మంది ఉంటారు. అయితే కేవలం పుస్తకం కొన్నందుకు జీవితం మారే ఛాన్స్ ఉంటుందా…అదీ ఏకంగా దాదాపు రూ.10 కోట్లు గెలిచే అవకాశం వస్తే? పది కోట్లు ఒక్కసారిగా వచ్చి పడితే జీవితం మారుతుంది కదా…అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇవేమీ కథలో వాక్యాలు కాదు..అలాగే ఇదేమీ ఏ ధనలక్ష్మి బంపర్ డ్రా ప్రకటన కాదు..మరి??
అక్కడికే వస్తున్నా… ప్రపంచంలోనే అత్యంత భారీ బహుమతులతో గేమ్స్ నిర్వహించే యూట్యూబ్ సంచలనం మిస్టర్‌బీస్ట్ ఇప్పుడు పుస్తకాల ప్రపంచంలో కూడా తనదైన గేమ్ మొదలుపెట్టాడు.
రండి ఒక పుస్తకం కొనండి? దాదాపు రూ.10 కోట్లు గెలుచుకునే అవకాశం మీకు రావచ్చు!అని ప్రచారం చేస్తూ ఓ పుస్తకం మన ముందుకు తెచ్చారు. అసలు ఏంటా పుస్తకం? అందులో కథ ఏంటి? పుస్తకం కొంటే నిజంగానే రూ.10 కోట్లు గెలుచుకోవచ్చా? అన్నది కదా సందేహం…
అసలు మొదటి నుంచీ మిస్టర్‌బీస్ట్ అంటే భారీ ఛాలెంజ్‌లు. వందల మంది పోటీదారులు. కళ్లుచెదిరే సెట్లు. చివర్లో కోట్ల రూపాయల బహుమతులు. ఇప్పుడు అదే ఫార్ములాను పుస్తకాల ప్రపంచానికి అప్లై చేస్తున్నాడు.
మిస్టర్ భీస్ట్ ఒరిజనల్ పేరు జిమ్మీ డొనాల్డ్సన్. అతను ప్రముఖ బెస్ట్‌సెల్లింగ్ రచయిత జేమ్స్ ప్యాటర్సన్తో కలిసి ది మోస్ట్ డేంజరస్ గేమ్స్ (The Most Dangerous Games) అనే నవల రాశాడు. ఆ నవలను తన క్రేజ్ తో ఓ నాలుగువేలు కాపీలు అమ్మేసి సైలెంట్ అయ్యిపోదలచుకుకోలేదు.అమ్మకాలు కూడా తన షోకు వచ్చే వ్యూస్ స్దాయిలో ఉండాలని కోరుకున్నాడు. అయితే అందుకు అతను చెప్పే కారణం…మా మిస్టర్‌బీస్ట్ వీడియోలను చూసే వాళ్లకు పుస్తకం చదివే అలవాటు కూడా పెంచాలనే అంటారు.
కానీ తను పుస్తకం పట్టుకుని, అందులో ఇదీ గ్రేట్ అని చెప్పూ వీడియోలు చేసినా,వ్యూస్,కామెంట్స్ వస్తాయేమో కానీ అమ్మకాలు పరుగెత్తవు,కరెన్సీ కురదవు అని తెలుసు. మరి ఏం చేయాలి అని ఆలోచించి.. ఈ స్కెచ్ వేసాడు మిస్టర్‌బీస్ట్!
పుస్తకం కొనండి… రూ.10 కోట్లు గెలిచే ఛాన్స్!
ఈ పుస్తకం రిలీజైన తర్వాత మిస్టర్‌బీస్ట్ చేసిన ప్రకటనే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుస్తకం కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. అందులో గెలిచే వ్యక్తికి 1 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మన కరెన్సీలో చెప్పాలంటే… దాదాపు రూ.10 కోట్లు!
మామూలుగా ఒక పుస్తకం కొంటే మనకు దొరికేది ఒక కథ. కానీ ఈ పుస్తకం కొంటే… కథతో పాటు కోట్ల రూపాయల కల కూడా దొరుకుతోంది! అయితే కండీషన్స్ అప్లై అనే చిన్న క్లాజ్ ఉంటుంది. పోటీలో పాల్గొనడానికి కొన్ని నిబంధనలు, అర్హతలు ఉంటాయి.అదిదా మేటర్. పది కోట్ల మేటర్ ప్రక్కన పెడితే.. ఈ పుస్తకం దేని గురించి?
అసలు పుస్తకం కథ కూడా డబ్బు చుట్టూనే!
బయట ఈ పుస్తకం కొన్న వారికి దాదాపు రూ.10 కోట్లు గెలిచే అవకాశం ఉన్నట్లే..పుస్తకం లోపల జరిగే కథ కూడా ఒక భారీ నగదు బహుమతి కోసం జరిగే పోటీ చుట్టూనే తిరుగుతుంది!ఈ కథలో ప్రపంచం నలుమూలల నుంచి వెయ్యి మంది పోటీదారులకు రహస్య ఆహ్వానం అందుతుంది. వారందరూ ఒక అసాధారణమైన పోటీలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. ఆ పోటీ చివర్లో గెలిచే వ్యక్తికి దక్కేది ఎంతంటే… 1 బిలియన్ డాలర్లు!
అవునూ…అంత డబ్బు ఎందుకు?
అదే ఈ కథలో అసలు ప్రశ్న. ఈ పోటీ కేవలం ధనవంతుడిని తయారు చేయడానికి కాదు. ప్రపంచాన్ని మార్చగలిగే ప్రత్యేక వ్యక్తి ఎవరో గుర్తించడానికి నిర్వహిస్తున్న పోటీగా కథ సాగుతుంది. ఆ వ్యక్తినే వారు “ది వన్” అంటారు. ఇది సాధారణ టీవీ గేమ్ అనుకుని చాలా మంది వస్తారు. పోటీ మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. పోటీదారులు ప్రమాదకరమైన అడవులను దాటాలి. మంచుతో కప్పుకున్న ప్రాంతాల్లో బతకాలి. సముద్రంలోని ప్రమాదాలను ఎదుర్కోవాలి. ప్రకృతి విసిరే సవాళ్లను జయించాలి.
వీటిన్నటి మధ్యా ప్రమాదాలు ఉంటాయి. అయితే మీరు ఊహిస్తున్నట్లు అసలు ప్రమాదం ప్రకృతితో మాత్రమే కాదు. పక్కనే నిలబడి ఉన్న పోటీదారుడే ఎప్పుడు ప్రత్యర్థిగా మారతాడో తెలియదు. అక్కడ స్నేహం ఉంటుంది. అనుమానం ఉంటుంది. ద్రోహం ఉంటుంది. బతకాలి అంటే గెలవాల్సిదే అనే కాన్సెప్టు అంతర్గతంగా నడుస్తుంది. అంతే కదా గెలవాలి అంటే ఎవరో ఒకరిని వెనక్కి నెట్టాల్సిందే. ఇదే ఈ కథలోని మెయిన్ సస్పెన్స్.
కథలోకి స్వయంగా మిస్టర్‌బీస్ట్ ఎంట్రీ!
మిస్టర్‌బీస్ట్ ఈ పుస్తకాన్ని కేవలం రాసి బయట కూర్చోలేదు. కథలో ఆయన స్వయంగా ఒక పాత్రగా కూడా కనిపిస్తాడు. అందుకే ఈ నవల చదివిన వారికి ఒక విషయం వెంటనే అర్థమవుతుందని విమర్శకులు చెబుతున్నారు. ఇది మిస్టర్‌బీస్ట్ వీడియోను పుస్తకంగా మార్చితే ఎలా ఉంటుందో… దాదాపు అలాంటిదే! దాదాపు బీస్ట్ తనకు బాగా తెలిసిన ప్రపంచాన్నే ఈసారి అక్షరాల్లోకి తీసుకొచ్చాడన్నమాట.
మిస్టర్‌బీస్ట్ ఏమంటారు…
మళ్లీ యువతను పుస్తకాల వైపు తీసుకురావడం తన లక్ష్యం అంటున్నారు. ఇప్పటి తరం చేతిలో ఫోన్ ఉంది. స్క్రీన్ కే కళ్లు అతుక్కుపోయి ఉంటున్నాయి. రీల్స్, షార్ట్ వీడియోలకే తమ జీవితం అంకితం అంటున్నారు. దాన్ని మార్చటం పుస్తక పఠనం వల్లే అంటున్నాడు.
ఒకప్పుడు పిల్లలు నిద్రపోయే ముందు కథల పుస్తకం తెరిచేవారు. ఇప్పుడు పడుకునే ముందు మొబైల్ తెరుస్తున్నారు. అలాంటి తరాన్ని మళ్లీ పుస్తకం వైపు తీసుకురావాలనేదే తన ప్రయత్నం అని చెప్తున్నాడు.
అందుకు వాళ్లకు మంచి కథ చెబితే సరిపోతుందా? ప్రముఖ రచయిత రాస్తే సరిపోతుందా? మిస్టర్‌బీస్ట్ సమాధానం మాత్రం చాలా సింపుల్. “పుస్తకం కొనండి… రూ.10 కోట్లు గెలుచుకునే అవకాశం పొందండి!” అప్పుడు పుస్తకం కొంటారు. చదువుతారు అంటాడు ఆయన.
అయితే ఓ సందేహం ఇలా భారీ బహుమతి చూపించి పుస్తకం కొనిపించడం వల్ల నిజంగానే చదివే అలవాటు పెరుగుతుందా? పుస్తకం కొన్న తర్వాత దాన్ని నిజంగా చదువుతారా? ఇదే ఈ ప్రయోగం ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్.అప్పుడు ఇదంతా మరో మిస్టర్‌బీస్ట్ గేమ్‌గా మాత్రమే మిగిలిపోతుంది.








