ఉపాధ్యాయుల సంభాషణలోనూ ‘‘ఆరా’’ ప్రస్తావించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులతో ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులతో పలు విషయాలపై చర్చించారు. అందులో ముఖ్యంగా పిల్లల విషయంలో ఉపాధ్యాయులు తీసుకుంటున్న శ్రద్ధ, వారిని ఉత్తమ విద్యార్థులుగా, పౌరులుగా ఎలా తీర్చిదిద్దుతున్నారు? అనుసరిస్తున్న మార్గాలు? వీటన్నింటినీ అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. అలాగే సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను కొనియాడటంతో పాటు సర్వేపల్లి సేవలను కూడా స్మరించుకున్నారు.
అయితే.. ముఖ్యంగా పిల్లల ‘‘స్క్రీన్ టైమ్’’ పై ప్రధాని ఎక్కువ దృష్టి నిలిపారు. ‘స్క్రీన్ టైమ్ ఓ వ్యసనంలా మారింది. నాకో ఆలోచన వచ్చింది. మైదానంలో ఆడే ఆటలపై పిల్లలకు ఆసక్తి పెరిగేలా చేస్తే స్క్రీన్ అడిక్షన్ నుంచి వారు బయటపడే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా ముఖ్యం’ అని అన్నారు. విద్యార్థుల చదువు గురించే కాకుండా, టీచర్లు వారి దైనందిన జీవితాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
’’జెన్ జీ’’ పదం ‘‘ఆరా’’ ను వాడిన ప్రధాని మోదీ..
ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ మళ్లీ జెన్ జీ కి దగ్గరగా వుండే ‘‘ఆరా’’ అనే పదాన్ని వాడారు. ఈ నెల మొదట్లో అంతరిక్ష స్టార్టప్‌ల సీఈఓలు, వ్యవస్థాపకులతో జరిగిన సంభాషణలోనూ మోదీ ఈ పదాన్ని వాడారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధాన మంత్రి జరిపిన సంభాషణలో ఈ ప్రస్తావన వచ్చింది;
అప్పుడు ఒక ఉపాధ్యాయురాలు, ప్రధాని మోదీకున్న ‘ఆరా’ (ప్రత్యేకమైన వ్యక్తిత్వ ప్రభావం) కారణంగా తాను కాస్త ఆందోళనకు గురవుతున్నానని ఆయనతో చెప్పింది. వెంటనే స్పందించిన ప్రధాని మోదీ, “అంటే… ఒక మంచి వక్తగా రాణించాలంటే మనిషికి అటువంటి ‘ఆరా’ ఉండకూడదన్నమాట?” అని చమత్కరించారు.
“లేదు, అది ఒకరి దగ్గర ఉండాలి. మీది ఇప్పటికే అక్కడ ఉంది కదా సార్,” అని ఆమె బదులిచ్చింది.
సంభాషణ అక్కడితో ఆగలేదు; ప్రధాని మోదీ, “అయితే ప్రజలు వినరు కదా! కేవలం మీ తేజస్సునే చూస్తూ ఉండిపోతారు,” అని వ్యాఖ్యానించారు.దానికి ఆ ఉపాధ్యాయురాలు చిరునవ్వుతో, “వారు మీ వైపే చూస్తూ ఉండిపోవచ్చు కదా సార్,” అని అన్నారు.
గత నెలలో, అంతరిక్ష పరిశోధనలో ప్రైవేట్ రంగానికి ఒక ప్రత్యేక ఆకర్షణను సృష్టించాలని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ కెరీర్‌ను నిర్మించుకోవాలంటే భారతదేశానికి రావాలని భావిస్తారని ఆయన అన్నారు. ఆ సమయంలో ఆయన అంతరిక్ష స్టార్టప్‌ల సీఈఓలు, వ్యవస్థాపకుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
‘కొన్ని ప్రధాన నగరాల్లోని విశ్వవిద్యాలయాలలో డ్రెస్ కోడ్ వివాదానికి సంబంధించి, చాలావరకు అవగాహన లోపం కనిపిస్తోంది. కొన్నిసార్లు ఎటువంటి వివరణ ఇవ్వకుండానే విద్యార్థులపై నిబంధనలను రుద్దుతున్నారు. ఉపాధ్యాయులు డ్రెస్ కోడ్ చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇటువంటి చర్యల కారణంగా పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు వస్తున్నాయా అని గమనించాలి. పిల్లల జీవితాలతో మమేకం కావడానికి మనం పాఠ్యపుస్తకాలు, సిలబస్‌లను దాటి ముందుకు రావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.








