వంగవీటి రాధాకు బెదిరింపులు.. పాస్పోర్ట్ వివాదంతో బెజవాడలో కలకలం..!
బెజవాడ రాజకీయాల్లో సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radha) చుట్టూ తిరుగుతున్న ఒక సరికొత్త వివాదం తీవ్ర సంచలనం రేపుతోంది. వంగవీటి రాధాకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఒక వ్యక్తి నేరుగా బెదిరింపులకు గురిచేయడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒక పాస్పోర్ట్(Passport) ఇప్పించే వ్యవహారంలో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీల గొడవే ఈ బెదిరింపులకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వసూళ్లు, హెచ్చరికలపై వంగవీటి రాధాకృష్ణ స్వయంగా పోలీసులను ఆశ్రయించారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. పాస్పోర్ట్ ఇప్పిస్తానంటూ మొయినుద్దీన్ అనే వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ కుటుంబానికి దగ్గరయ్యాడు. అయితే, ఈ ప్రక్రియకు సంబంధించి సాధారణంగా అయ్యే రూ. 5 వేల ఖర్చుకు బదులుగా.. సదరు మొయినుద్దీన్ ఏకంగా రూ. 35 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతను అడిగినంత భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు వంగవీటి రాధాకృష్ణ మరియు ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసి బెదిరింపులకు దిగాడు.
డబ్బులు ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ మొయినుద్దీన్.. వంగవీటి రాధా, ఆయన ఫ్యామిలీని తీవ్ర పదజాలంతో హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. “మీకు పాస్పోర్ట్ ఎలా వస్తుందో నేనూ చూస్తా” అంటూ సదరు వ్యక్తి రాధా ముఖం మీదే సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ తరహా బ్లాక్మెయిలింగ్ మరియు అనుచిత ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంగవీటి రాధాకృష్ణ.. నిందితుడు మొయినుద్దీన్పై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. రాధా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ బెదిరింపుల వ్యవహారం వెనుక ఉన్న అసలు కారణాలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.








