రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే ఈ తరానికి మ్యాచ్ అవ్వాలి..!
మంగళగిరిలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక “టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్” రెండవ రోజు సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరియు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు రాజకీయాల్లో రాణించడానికి అవసరమైన కీలక సూత్రాలను వివరించారు. ఈ తరం ఓటర్లను ఆకట్టుకుంటూ, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఎలా నిలదొక్కుకోవాలో తమ అనుభవాల ద్వారా దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు.. తాను తొలిసారి ఎమ్మెల్యే అయిన రోజులను గుర్తుచేసుకుంటూ నాటి రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. “నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగేవాడిని. ఉద్యోగులతో, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. స్వయం ప్రేరణతో సమస్య పరిష్కారమయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టకుండా పనిచేసేవాళ్లం” అని వివరించారు.
ప్రజలతో నిత్యం మమేకమవుతూ, సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరుచుకుంటూ, కొత్త నాయకులను తీర్చిదిద్దుతూనే తాను ఈ స్థాయికి వచ్చానని చంద్రబాబు వెల్లడించారు. ఈ నాటి తరం రాజకీయాల్లో సక్సెస్ సాధించాలంటే.. ప్రస్తుత తరం ఆలోచనలకు, అవసరాలకు అనుగుణంగా మారాలని, మన నడవడికను ప్రజలు ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటారనే స్పృహ ప్రతి ఒక్కరిలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ లీడర్షిప్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉండే నాయకులకే భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి
“ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉంటూ ‘డోర్ టు డోర్ క్యాంపెయిన్’ ఎక్కువగా చేస్తారో, వారు మాత్రమే రాజకీయాల్లో ఘన విజయం సాధించగలరు” అని లోకేష్ పేర్కొన్నారు. నిరంతరం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండటం ద్వారా యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలతో బలమైన అనుబంధం పెరుగుతుందని వివరించారు. ఇదే సమయంలో పార్టీ కోసం స్థానికంగా ఉండి, కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు ఖచ్చితంగా సరైన గుర్తింపు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. యువతకు ప్రాధాన్యత ఇస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగిన ఈ కాంక్లేవ్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.








