మాయావతి మేనల్లుడు వర్సెస్ సీనియర్లు? సీనియర్లదే పై చేయి?
వచ్చే యేడాదిలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా హఠాత్తుగా బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి యాక్టివ్ అయిపోయారు. పార్టీలో అప్పట్లోనే నెంబర్ 2 గా వున్న మిశ్రాకు అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారు. దీంతో అగ్రకులాల ఓట్లపై కన్నేశారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని, ఇకపై పొత్తులు వుండవని కూడా మాయావతి ప్రకటించేశారు.
ఇంతలోనే మరో పరిణామం కూడా జరిగింది. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను పార్టీ జాతీయ కో ఆర్డినేటర్ పదవి నుంచి తొలగించేశారు. మరింత రాజకీయ పరిణతి ఆయనకు అవసరమని చెబుతూ, తొలగించేశారు. అయితే.. ప్రస్తుతం ఆయనకు ఏ బాధ్యతలూ ఇవ్వని, బీఎస్పీలో మాత్రం కొనసాగుతారని మాయావతి ట్విస్ట్ ఇచ్చారు. ఆకాష్‌కు బీఎస్పీలో పనిచేసే అవకాశం కల్పించినప్పటికీ, ఆయన ఇంకా రాజకీయ పరిణతిని సాధించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఎస్పీకి నష్టం వాటిల్లకుండా చూసేందుకే ఈ తాజా నిర్ణయం అవసరమైందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆకాశ్ కి ఇలా దెబ్బపడటం ఇదేమీ కొత్త కాదు. ఇటీవలి కాలంలో పలుమార్లు ఇలాగే జరిగింది. గతంలోనూ పార్టీ కీలక పదవుల నుంచి తప్పించారు. అయితే గతంలో ఆకాశ్ రిజర్వేషన్లు, దళితుల విషయంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అది కాస్త పార్టీని ఇబ్బంది పెట్టిందని నేతలు అంటుంటారు. అప్పుడు మాయావతి తనకు క్లాస్ పీకారని, సోషల్ మీడియా తగ్గించుకొని, సంస్థాగత బాధ్యతలపై దృష్టి పెట్టాలని అప్పట్లోనే మందలించారు. అయితే.. మరోవైపు, మీడియా మరియు సోషల్ మీడియా నిర్వహణలో ఆకాష్‌కు మెరుగైన నైపుణ్యం ఉంది. ఆయన బీఎస్పీ (BSP) సమాచార ప్రసార విధానాన్ని ఆధునీకరించడానికి కృషి చేశారు; అలాగే, పార్టీ వైఖరిని ఆన్లైన్లో క్రమం తప్పకుండా ప్రచారం చేసే సోషల్ మీడియా వాలంటీర్ల నెట్‌వర్క్‌ను ఆయన బృందం ఏర్పాటు చేసింది.సతీష్ మిశ్రా, రామ్‌జీ గౌతమ్ వంటి సీనియర్ నాయకులు బెహన్ జీకి అండగా ఉంటూ, ఆమెకు సలహాలు ఇస్తుంటారు. యువతను పార్టీలోకి తీసుకురావాలని, అలాగే మీడియా మరియు సోషల్ మీడియాలో బీఎస్పీ (BSP) మరింత ఎక్కువగా కనిపించేలా చేయాలని ఆకాష్ ప్రయత్నించారు. పార్టీ పాత వ్యవస్థాగత నిర్మాణాన్ని మార్చాలని కూడా ఆయన భావించారు. ఇదే పరిణామం.. సీనియర్లు రుచించలేదని, పార్టీని హైజాక్ చేయాలని ఆకాశ్ చూస్తున్నట్లు వారు భావించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీ రాష్ట్రంలో అంతంత మాత్రమే వుంది. ఇప్పటి నుంచే సీనియర్లు అలర్ట్ అయ్యారని, ఆకాశ్ విషయంలో అధినేత్రి మాయావతికి ఏదో చెప్పి వుంటారని, అందుకే మళ్లీ మాయావతి ఆయన్ను కీలక బాధ్యతల నుంచి తప్పించారన్న వదంతులు వున్నాయి.








