పదవి కంటే మా ఆవిడ ముఖ్యం: నెహ్రా
భారత క్రికెట్ జట్టు (Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపై నిరంతరం విమర్శలు వస్తున్న తరుణంలో, తదుపరి కోచ్‌గా ఎవరిని నియమిస్తారనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఈ రేసులో వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (GT) విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే, భవిష్యత్తులో టీమిండియా ప్రధాన కోచ్ అయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఆశిష్ నెహ్రా తనదైన శైలిలో స్పందిస్తూ.. క్రికెట్ వర్గాల్లో నవ్వులు పూయించారు.
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) వార్షిక అవార్డుల ప్రధానోత్సవంలో నెహ్రా మాట్లాడుతూ.. భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవమని, కానీ తనకు ఎలాంటి ప్రత్యేక ఆశయాలు లేవని తేల్చిచెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో తనకు ఆఫర్ వస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు స్పందిస్తూ.. “నేను మొదట మా ఇంట్లోని ‘హైకమిషన్’ అయిన మా ఆవిడను అడగాలి, లేదంటే ఆమె నాకు విడాకులు ఇవ్వడం ఖాయం” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో కోచింగ్ అంటే ఏడాదిలో దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల పాటు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, అది అంత సులభం కాదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయ స్థాయిలో ఏ కోచ్ కూడా మూడు నాలుగు ఏళ్లకు మించి ఎక్కువ కాలం కొనసాగలేకపోవడానికి ఈ సుదీర్ఘ ప్రయాణాలు, ఒత్తిళ్లే కారణమని నెహ్రా విశ్లేషించారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయాలపై మాట్లాడుతూ.. ఆ క్రెడిట్ అంతా జట్టుది మరియు కెప్టెన్‌దే తప్ప, కేవలం కోచ్ వల్ల మాత్రమే విజయాలు రావనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తాను ఉన్న పొజిషన్లో చాలా సంతోషంగా ఉన్నానని నెహ్రా స్పష్టం చేశారు.








