బటర్‌ఫ్లై ఎఫెక్ట్: స్టీవ్ జాబ్స్‌తో మొదలైన కథ… ₹100 కోట్ల దగ్గర ఎలా వచ్చింది?
ఎక్కడో…
ఎవరికీ తెలియని ఓ చోట…
ఒక సీతాకోకచిలుక తన రెక్కలను మెల్లగా విప్పింది.ఒక్కసారి విదిలించి గాల్లోకి ఎగిరింది. ఆ చిన్న రెక్కల కదలికతో గాలిలో మనం గుర్తించలేనంత స్వల్పమైన మార్పు జరిగింది.
ఆ మార్పును ఎవరూ గమనించలేదు. ఆకాశం అలాగే ఉంది. చెట్లు అలాగే ఉన్నాయి. ప్రపంచం కూడా ఏమీ జరగనట్టే ముందుకు సాగిపోయింది. అయితే ఆ గాలి అక్కడితో ఆగిపోయిందా? ఆ చిన్న కదలిక ఇంకో గాలి ప్రవాహాన్ని తాకిందా? అది మరో మార్పుకు కారణమైందా? ఆ మార్పు ఇంకెక్కడో… మరో సంఘటనను మెల్లగా తన దిశగా తిప్పిందా?ఇవన్నీ ఎవరికీ తెలియదు.
అలాంటి కొన్ని సంఘటనలు మన జీవితంలో ఉంటాయి. అవి జరిగే సమయంలో వాటి అసలు అర్థం చెప్పవు. అవి నిశ్శబ్దంగా వచ్చి వెళ్లిపోతాయి.
ఒకరోజు మాత్రం… మనల్ని చాలా దూరం తీసుకొచ్చిన తర్వాత…వెనక్కి తిరిగి చూసేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాంటి సంఘటన ఓ అమ్మాయి జీవితంలో జరిగింది. అదే ఇవాళ వంద కోట్ల ‘హనుమాన్ అంశ్’ సినిమా ని అందించింది.
‘హనుమాన్ అంశ్’.
సుమారు రూ.2 కోట్లతో తీసిన సినిమా. నెలరోజుల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు. ఇప్పుడు ఐదో వారంలోనూ పెద్ద పాన్ ఇండియా సినిమాల రికార్డులతో పోటీ. సరే… ఇక్కడి వరకు ఇది ఒక సినిమా సక్సెస్ స్టోరీ. అయితే అసలు విచిత్రం ఏంటంటే…
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు 21 ఏళ్ల అనుప్రియా నాగర్. ఆమెను చూస్తే మనకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. “ఈ అమ్మాయి అసలు సినిమా నిర్మాత ఎలా అయింది?” ఎందుకంటే ఆమె ప్లాన్ సినిమా కాదు. సినిమా చదవలేదు. సినీ పరిశ్రమలోకి రావాలని కూడా అనుకోలేదు.
మరి ఎలా మ్యాజిక్ జరిగింది?
ఇక్కడి నుంచి కథను వెనక్కి తిప్పాలి.
అనుప్రియా యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ చదువుతోంది. ఫైనల్ ఇయర్. మిగతా విద్యార్థుల్లాగే ఆమెకు కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అందులో విషయం ఏమిటంటే… పెద్ద టెక్నాలజీ కంపెనీలు ఎలా ఎదుగుతాయి? వాటి ఫౌండర్లకు కొత్త కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి?
అంతే. ఇక్కడ ఎక్కడా సినిమా లేదు. కెమెరా లేదు. హీరో లేదు. అయితే ఆ పరిశోధన చేస్తూ చేస్తూ ఆమె ఒక పేరు దగ్గరకు వెళ్లింది. స్టీవ్ జాబ్స్. ఇక్కడి వరకు కూడా అంతా మామూలే.
కానీ స్టీవ్ జాబ్స్ గురించి చదువుతుండగా…అనుప్రియకు ఇంకో పేరు కనిపించింది. ఆ పేరు నీమ్ కరోలి బాబా. అక్కడే కథ మెల్లగా దారి మారింది.
స్టీవ్ జాబ్స్ కథలో… భారతీయ సాధువు ఎందుకు?
స్టీవ్ జాబ్స్ భారతదేశానికి వచ్చాడని ఆమె చదివింది. ఉత్తరాఖండ్‌లోని కైంచి ధామ్ గురించి తెలుసుకుంది. ఆ తర్వాత నీమ్ కరోలి బాబా పేరు కనిపించింది. ఇక్కడ అనుప్రియా మనసులో ఒక చిన్న సందేహం వచ్చింది. “మన దేశానికి చెందిన ఈ వ్యక్తి గురించి నేను విదేశీయుల కథలు చదువుతూ ఎందుకు తెలుసుకుంటున్నాను?”
ఇదే అసలు టర్నింగ్ పాయింట్.
ఎందుకంటే…ఆమె అసైన్మెంట్ అప్పటికే పూర్తయిపోయి ఉండొచ్చు. మార్కులు వచ్చి ఉండొచ్చు. ఆ విషయం అక్కడితో ముగిసిపోయి ఉండొచ్చు. ఆ ప్రశ్న మాత్రం ఆమెను వదల్లేదు.
అసలు నీమ్ కరోలి బాబా ఎవరు? అని మరింత వెతకడం మొదలుపెట్టింది. ఇక్కడే ఆ చిన్న విషయం పెద్దైంది నీమ్ కరోలి బాబా గురించి తెలుసుకున్న కొద్దీ… ఆ కథను ఇంకొంతమందికి చెప్పాలనిపించింది.
అయితే సినిమాగా కాదు. పుస్తకమా? కామిక్‌గా చేస్తే బాగుంటుందా? అని అనుకుంది. గమనించాల్సిన విషయం ఇదే. స్టీవ్ జాబ్స్ ఆమెకు సినిమా తీయడం నేర్పలేదు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లమని కూడా చెప్పలేదు. అయితే ఆయన గురించి చదివినప్పుడు కనిపించిన ఒక పేరు…ఆమెను ఒక కథ వెనుక పరుగెత్తేలా చేసింది.
ఇక్కడే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ తన పని మొదలుపెట్టింది.
అప్పుడు కథలోకి విశాల్ వచ్చాడు. అనుప్రియా ప్లాన్ మాత్రం వేరే. చదువు పూర్తయిన తర్వాత స్విట్జర్లాండ్ వెళ్లి ఉద్యోగం చేయాలని అనుకుంది. కానీ జీవితం ఒక్కోసారి మన ప్లాన్ అడగదు కదా!
ఆమె భారత్‌కు తిరిగి వచ్చింది. అక్కడే దర్శకుడు విశాల్ చతుర్వేదిని కలిసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అనుప్రియా అప్పటికే నీమ్ కరోలి బాబా గురించి పరిశోధిస్తోంది. మరోవైపు విశాల్… అదే నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా సినిమా తీయాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
వేర్వేరు దారుల్లో నడిచిన ఇద్దరు వ్యక్తులు…
ఒకే కథ దగ్గర కలిశారు. అక్కడి నుంచి… పుస్తకం, కామిక్ అని ఆలోచిస్తున్న అనుప్రియా జీవితంలోకి సినిమా వచ్చింది. చివరకు ఆమె నిర్మాతగా మారింది.
“ఎకనామిక్స్ చదివి… సినిమా తీస్తావా?” ఇంట్లో కూడా సహజంగానే ప్రశ్న వచ్చింది. “నువ్వు చదివిందేంటి… ఇప్పుడు చేయబోయేది ఏంటి?” . నిజమే కదా! ఎకనామిక్స్ చదివింది. స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకుంది. ఇప్పుడు సినిమా నిర్మాత అయ్యింది.
కానీ వెనక్కి తిరిగి చూస్తే…
ఆమె జీవితంలో కథలతో సంబంధం అసలు లేదనడం కూడా కష్టం. ఆర్ట్‌పై ఆసక్తి ఉంది. డ్యాన్స్ చేసింది. కళారంగానికి చెందిన వ్యక్తుల గురించి తెలుసుకుంది. స్టూడెంట్ కార్యక్రమాల్లో పాల్గొంది. కథలు చెప్పడం అంటే ఇష్టం. అప్పటివరకు ఇవన్నీ వేర్వేరు విషయాల్లా కనిపించాయి. సినిమా దగ్గరకు వచ్చాక… అన్నీ ఒక్కచోట కలిసినట్టయ్యాయి.
సినిమా విడుదలైన తర్వాత మరోసారి బటర్‌ఫ్లై ఎఫెక్ట్
‘హనుమాన్ అంశ్’ విడుదలైంది. మొదటి వారం… అనుకున్నంత భారీగా ఏమీ జరగలేదు. అక్కడితో సినిమా ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఒక ప్రేక్షకుడు సినిమా చూశాడు. ఇంకొకరికి చెప్పాడు. “బాగుంది… ఒకసారి చూడు.” ఆ ఒక్క మాట ఇంకొకరిని థియేటర్‌కు తీసుకొచ్చింది. వాళ్లు ఇంకొంతమందికి చెప్పారు. అలా… నెమ్మదిగా…సినిమా గురించి టాక్ బయటకు వెళ్లడం మొదలైంది. భారీ ప్రకటనల కంటే… ప్రేక్షకుడి మాట బలంగా పనిచేసింది. చివరకు… రూ.2 కోట్ల సినిమా రూ.100 కోట్లకు పైగా వెళ్లింది.
ఇప్పుడు అసలైన చైన్ కనిపిస్తోందా?
ఒక ₹100 కోట్ల సినిమా. దాని వెనుక ప్రేక్షకుల మాట. దాని వెనుక ఒక సినిమా. దాని వెనుక 21 ఏళ్ల నిర్మాత. ఆమె వెనుక ఒక దర్శకుడితో పరిచయం. ఆ పరిచయం వెనుక ఒక భారతీయ సాధువుపై ఆసక్తి. ఆ ఆసక్తి వెనుక… స్టీవ్ జాబ్స్ గురించి చేసిన ఒక యూనివర్సిటీ అసైన్మెంట్. అదే ఈ కథలో అసలైన విషయం.
కంక్లూజన్
నిజానికి ఇప్పుడే మొదలైన కథకు కంక్లూజన్ ఇవ్వటం కష్టం. ఈ క్రమం మొత్తాన్ని తత్వవేత్తలు ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ అనొచ్చు. ఎక్కడో జరిగిన ఒక చిన్న కదలిక… కాలంతో పాటు ఎన్నో సంఘటనలను తాకుతూ, చివరకు ఊహించని చోటికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.
ఆధ్యాత్మికంగా ఆలోచించే వారు మాత్రం మరోలా చూడొచ్చు. హనుమంతుడి భక్తుడైన నీమ్ కరోలి బాబా కథ కోసం వెతుకుతున్న ఆమెను…అదే హనుమంతుడు ఒక్కో అడుగు వేయిస్తూ సినిమా వరకు తీసుకొచ్చాడని నమ్మొచ్చు. మరికొందరు వీటన్నింటినీ యాదృచ్ఛికాలు అనొచ్చు. లేదా విధి ముందే వేసిన దారులు అనొచ్చు. ఎవరి నమ్మకం వారిది.
కానీ ఒక విషయం మాత్రం నిజం. జీవితం మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం మాత్రమే సాగదు. దాని అసైన్మెంట్ దానికి ఉంటుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








